220 మినీ ఏసీ బస్సులు
సాక్షి, చైన్నె : చైన్నెలో మెట్రో రైల్వేస్టేషన్ల పరిసర మార్గాలను అనుసంధానించేలా మినీ ఏసీ బస్సులను నడిపేందుకు రవాణా సంస్థ నిర్ణయించింది. 220 బస్సుల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. రాజధాని నగరంలోని మెట్రో, ఎలక్ట్రిక్, ఎంటీసీ బస్సులతో పాటుగా క్యాబ్, ఆటో తదితర రవాణా సేవలన్నీ ఒకే గూటిలోకి తీసుకొచ్చేలా చైన్నె ఇంటిగ్రేటెడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (సీయూఎంటీఏ) పర్యవేక్షణలో ప్రత్యేక యాప్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. అన్ని రవాణా సేవలకు ఒకే టికెట్ అన్నట్టుగా క్యూర్ కోడ్ టికెట్‌తో మల్టీ మోడల్ సేవ దిశగా రూపకల్పన చేసిన చైన్నె ఒన్ యాప్‌ను సీఎం స్టాలిన్ గత నెలలో ఆవిష్కరించారు. ఈ పరిస్థితుల్లో మెట్రో సేవలను వినియోగిస్తున్నవారు మరీ ఎక్కువ అవుతుండడంతో వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా మినీ బస్సుల సేవలను నగరంలో కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చైన్నెలో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్‌కు, అలాగే, ఆలందూరు మీదుగా అన్నాసాలై వెంబడి సెంట్రల్ – విమ్కో నగర్ వరకు మెట్రో సేవలు అందిస్తున్నారు. కొన్ని మార్గాల్లో ప్రజలకు ఆయా స్టేషన్ పరిసరాల్లోకి వెళ్లేందుకు వీలుగా మినీ బస్సులు నడుపుతున్నారు. ఇవి చాలీ చాలనంతంగా ఉండడంతో ప్రయాణికులు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీనిని పరిగణించిన రవాణా సంస్థ మినీ బస్సులను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. మరో ఏడాదిన్నర లేదా, రెండేళ్లలో మరో మూడు మార్గాలలోనూ మెట్రో రైలు పట్టాలెక్కించనున్న నేపథ్యంలో ఆయా మార్గాలను అనుసంధానించేలా రోడ్డు రూట్ మ్యాప్‌నకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలుత 220 మినీ ఏసీ బస్సులను కొనుగోలు చేసి మెట్రో ప్రయాణికులు, స్టేషన్ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలకు వారు రోడ్డు మార్గంలో చేరేందుకు వీలుగా ఏసీ బస్సులను మరికొన్ని నెలలో నడిపే దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే, డిజిటల్ రవాణా కార్డుల సేవలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టారు.


