డీబీసీ కేంద్రాల్లో కేంద్ర బృందం
తిరువళ్లూరు: వరి పంటలో తేమ శాతం 17 కంటే ఎక్కువగా వున్నా కొనుగోలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈక్రమంలో వరి కొనుగోలు, తేమ శాతాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తిరువళ్లూరులో ఆదివారం ఉదయం పర్య టించింది. తిరువళ్లూరు, ఊత్తుకోట, గుమ్మిడిపూండి, పొన్నేరి ప్రాంతాల్లో కమిటీ పర్యటించి వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ వుంచిన వరిని పరిశీలించి రైతుల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనేపథ్యంలో తేమ శాతాన్ని పెంచి రైతుల నుంచి వరిని కొనుగోలు చేయాలని పలు రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగానే రైతుల విజ్ఞప్తి మేరకు 17 శాతం కంటే తేమ ఎక్కువగా వున్నా వరిని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాల ని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వరికొనుగోలు కేంద్రాల వద్ద వున్న పరిస్థితి, వరి ధాన్యాల నిల్వలు, తేమ శాతాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ బృందం కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్‌లై డిప్యూటీ డైరెక్టర్ ప్రీతి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు అనుపమ, అరుణ్‌ప్రసాద్, ఉమామహేశ్వరి, కలెక్టర్ ప్రతాప్ తిరువళ్లూరు జిల్లాలో పర్యటించారు. రైతుల నుంచి వినతి పత్రాలను స్వీకరించడంతో పాటు డీబీసీ కేంద్రాల్లో వున్న వరి నిల్వను పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ వరిలో తేమ శాతం 17 కంటే ఎక్కువగా వున్నా రైతులకు నష్టం జరగకుండా వరిని కొనుగోలు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమ కమిటీ నివేదికను ఇస్తుందన్నారు.


