పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీగాంధీ
సేలం: తనయుడు అన్బుమణికి పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పూర్తిగా చెక్ పేట్టేశారు. తన పెద్ద కుమార్తె శ్రీగాంధీకి పెద్ద పీట వేశారు. ఆమెకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్( కార్యనిర్వాహక అధ్యక్షురాలు) పదవిని అప్పగిస్తూ శనివారం రాందాసు నిర్ణయం తీసుకున్నారు. వివరాలు.. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న వార్ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణి చర్యలతో విసిగి వేసారిన, పార్టీ అధినేత రాందాసు చివరకు ఆయన్ను తప్పించారు. ఆయన చేతిలో తొలుత ఉన్న అధ్యక్ష పదవిని లాగేసుకున్న ఆయన ఆ తదుపరి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా తప్పించారు. అదే సమయంలో అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని రాజకీయంగా రంగంలోకి దించేందుకు రాందాసు సిద్ధమైనట్టు పీఎంకే వర్గాలు పేర్కొంటు వచ్చాయి. పార్టీ సర్వసభ్య సమావేశంలో గానీయండి, ఇతర సమావేశాలలో గానీయండి ఆమెకు రాందాసు ప్రాధాన్యతను ఇస్తూ రావడం గమనార్హం. అన్బుమణికి పూర్తిగా చెక్ పెట్టడం లక్ష్యంగా శనివారం రాందాసు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కీలక బాధ్యతలు..
ధర్మపురిలో శనివారం పార్టీ జనరల్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ గౌరవ అధ్యక్షుడు జికేమణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాందాసు కీలక ప్రకటన చేశారు. 46 సంవత్సరాల క్రితం పీఎంకే ఆవిర్భావం, పార్టీ బలోపేతానికి తాను పడ్డ శ్రమను వివరించారు. ధర్మపురి నేల నుంచి నాటిన విత్తనం నేడు వికసిస్తున్నట్టు పేర్కొంటూ, దీనిని సురక్షితం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అనేక త్యాగాలు పార్టీకోసం చేసిన వారెందరో ఉన్రానని వివరిస్తూ తాజాగా పార్టీకి , తనకు రక్షణగా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆమేరకు తన పెద్దకుమార్తె శ్రీ గాంధిని పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్టు తెలిపారు. అలాగే, పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా జీకేమణి కుమారుడు తమిళ్‌కుమరన్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈసందర్భంగా శ్రీగాంధీ మాట్లాడుతూ, పెద్దయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని, పార్టీ బలోపేతం లక్ష్యంగాముందుకు సాగనున్నట్టు వివరించారు. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ కష్ట సమయాలలో తాను యువజన నేత పదవి చేపడుతున్నానని పేర్కొంటూ, తన తండ్రి తరహాలో పార్టీకి విధేయతతో ఉంటానని స్పష్టం చేశారు. కాగా శ్రీగాంధీ నియామకం గురించి అన్బుమణిని ప్రశ్నించగా మౌనం వహించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి బహింగంగా మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు.


