బైక్‌ను ఢీకొన్న జేసీబీ
● భార్యాభర్తలు మృతి ● బంధువుల గృహ ప్రవేశానికి వెళ్తూ ఘటన
అన్నానగర్: ఓమలూరు సమీపంలో సోమవారం ఉదయం జేసీబీ వాహనం బైకును ఢీ కొట్టడంతో భార్యాభర్తలు మరణించారు. బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని సిక్కం పట్టి గ్రామం పెరియకడం పట్టి ప్రాంతానికి చెందిన మురుగన్(40). ఇతని భార్య పార్వతి(32). ధర్మపురి జిల్లా పాలయంపుదూర్‌లో బంధువుల గృహ ప్రవేశం వేడుక కోసం సోమవారం ఉదయం ఓమలూరు నుండి బయల్దేరారు. ఓమలూరు దీవట్టి పట్టి పక్కన ఉన్న జోడుకులి దగ్గర జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ఆ రోడ్డు వెంట ఒక జేసీబీ వాహనం వేగంగా ఆ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే దివట్టిపట్టి ఇన్‌స్పెక్టర్ సెంథిల్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా భార్యాభర్తలు ప్రమాదంలో మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.


