సర్దార్ జయంతికి యూనిటీ మార్చ్
తిరువళ్లూరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లాలోని ఆర్కేపేట, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ పేరిట పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తిరువళ్లూరు జిల్లా యువ, మేరా భారత్ అధికారి నమ్మాల్ కృష్ణ వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ యువజన క్రీడా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐక్యత యాత్ర పేరిట యూనిటీ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాలోని ఆర్కేపేట, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో యూనిటీ మార్చ్‌ను నిర్వహించనున్నారు. జిల్లాలో జరిగే యూనిటీ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసే కార్యక్రమం సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని క్రీడా మైదానంలో జరిగింది. కార్యక్రమానికి జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతరామన్, కోఆర్డినేటర్ మీనాక్షిసుందరి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా యువజన, మేరా యువ భారత్ అధికారి నమ్మాల కృష్ణ హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. వివరాలను మీడియాకు వివరించారు. తిరువళ్లూరు జిల్లాలో ఆర్కేపేటలోని అన్నామలై ఆర్ట్స్ కళాశాల మైభారత్ తిరువళ్లూరు ఉమ్మడిగా స్థానికంగా ఉన్న పద్మావతి మహల్ నుంచి ఆర్కేపేట తాలూకా కార్యాలయం వరకు జరగనుంది. నవంబర్ ఐదున తిరుమురుగన్ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, మైభారత్ ఉమ్మడిగా పూండి బైపాస్ నుంచి తిరువళ్లూరులోని స్పోర్ట్స్ మైదానం వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువతకు ఐక్యత, విలువలను తెలియజెప్పడమేనన్నారు. పాదయాత్రలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మై భారత్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో యూనిటీ మార్చ్‌లు ముగిసిన తరువాత జాతీయ స్థాయిలో నవంబర్ 26 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు గుజరాత్ కరంసద్ నుంచి కేవడియాలోని యూనిటి ఆర్చ్ వరకు 152 కిమీ మేరకు పాదయాత్ర జరగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతురామన్, కోఆర్డినేటర్ మీనాక్షిసుందరి, ఎన్‌ఎస్‌ఎస్ డీఎల్‌ఓ కేశవులు, తిరుమురుగన్ కళాశాల ప్రిన్సిపల్ అముదాయి తదితరులు పాల్గొన్నారు.


