కొరుక్కుపేట: అందరూ సంయమనం పాటించాలని తమిళనాడు లోకాయుక్త చైర్‌పర్సన్ జస్టిస్ పి.రాజమణిక్యం అన్నారు. సదరన్ రైల్వే ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ను పాటిస్తోంది. అందులో భాగంగా సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ పి.రాజమాణిక్యం పాల్గొన్నారు. చైన్నెలోని సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్, ప్రధాన విభాగాల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అవేర్ నెస్ వీక్‌ను ప్రారంభించిన జస్టిస్ పి.రాజమాణిక్యం మాట్లాడుతూ ఈ సంవత్సరం విజిలెన్స్–మా భాగస్వామ్య బాధ్యత అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, దుష్ప్రవర్తన, లంచం, నిధుల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వివిధ చట్టాల నిబంధనలను ఆయన వివరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సదరన్ రైల్వే చురుకై న చర్యలను ప్రశంసించారు. రైల్వే కార్యకలాపాల సామర్థ్యాన్ని సమష్టిగా పెంచిన సాంకేతికత వినియోగం, నివారణ విజిలెన్స్ తనిఖీలు, వ్యవస్థాగత మెరుగుదలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా సదరన్ రైల్వే విజిలెన్స్ విభాగం ఇంటిగ్రిటీ బులెటిన్–2025ను విడుదల చేసింది.


