తిరుత్తణిలో 8 సెం.మీ వర్షపాతం
తిరుత్తణి: తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మోస్తరుగా ప్రారంభమై భారీ వర్షం కుమ్మరింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, ఇళ్లు, రోడ్లలో వర్షపు నీరు పేరుకుపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో కుశస్థలి, నంది నదిలో వరదపోటెత్తుతోంది. కాగా కనకమ్మసత్రం ప్రభుత్వ మహాన్నత పాఠశాల చుట్టూ వర్షపు నీరు గుంటను తలపించేలా పేరుకుపోయింది. రెండు తరగతి గదులకు సైతం వర్షపు నీరు చేరడంతో గురువారం బడికి వచ్చిన విద్యార్థులు ప్రత్మామ్నయంగా ఇతర తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. పాఠశాల హెచ్‌ఎం మణిగండన్ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చి నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో నీరు పేరుకుపోవడం పట్ల హెచ్‌ఎం మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున వర్షపు నీరు ప్రవహించే కాలువలు తెగి నీరు పేరుకుపోతున్నట్లు, వెంటనే పంచాయతీ ద్వారా జేసీబీ సాయంతో పేరుకుపోయిన నీటిని తొలగించినట్లు తెలిపారు.


