పాలారు నదిలో నీటి ఉధృతి | - | Sakshi
Sakshi News home page

పాలారు నదిలో నీటి ఉధృతి

Oct 24 2025 7:44 AM | Updated on Oct 24 2025 7:44 AM

పాలార

పాలారు నదిలో నీటి ఉధృతి

● వేలూరు, గుడియాత్తంలో నీట మునిగిన ఇళ్లు ● చెరువులు, కుంటల్లో చేరిన వర్షపు నీరు

వేలూరు: కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలారు నదిలో నీటిమట్టం పెరిగింది. గత ఆదివారం నుంచి వర్షాలు కురవడంతో వేలూరు పట్టణంలోని ముళ్లిపాళ్యం, బెంగుళూరు రోడ్డు, ఇందిరానగర్‌ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు నిద్రాహారాలు మాని మిద్దెలపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తుండడంతో వేలూరు, గుడియాత్తం, రాణిపేట వంటి ప్రాంతాల్లో సుమారు 100 ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు వేరే మార్గాలు లేకుండా కట్టుబట్టలతో మిద్దెలపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాణిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా వర్షపు నీరు చేరడంతో వైద్యులు, రోగులు ఆసుపత్రిలోకి వెళ్లలేక పోయారు. ఇదిలా ఉండగా రోగులకు ఇచ్చే మందులు కొంత వరకు తడిసి పోవడంతో వైద్య సిబ్బంది వాటిని అప్రమత్తం చేస్తున్నారు.

పాలారులో పెరిగిన నీటిమట్టం

వాణియంబాడి, ఆంబూరు వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో భారీ వర్షాలు కురవడంతో అక్కడున్న చెక్‌డ్యామ్‌లు, చెరువులు పూర్తిగా నిండి పోయి నీరు పాలారునదిలోకి చేరుతోంది. పాలారులో గత నాలుగు రోజులుగా నీరు వస్తున్నప్పటికీ రాత్రి కురిసిన వర్షాలకు నీటిమట్టం పెరగడంతో ఆంబూరు, వాణియంబాడి, వేలూరు కొత్త బస్టాండ్‌, ఆర్కాడు బ్రిడ్జి వంటి ప్రాంతాల్లో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 540 చెరువులు పూర్తిగా నిండి పోయింది. పాలారులో నీటిమట్టం పెరగడంతో వేలూరు నార్త్‌ పోలీసులు పాలారు వద్ద అక్కడక్కడ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ఎవరూ పాలారునదిలోకి దిగకూడదని ఆంక్షలు విధించారు.

చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తే..

ఆంధ్ర తరహాలో పాలారునదీ పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడా చెక్‌డ్యామ్‌లు నిర్మించి వర్షపు నీటిని సంరక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు. డ్యాం లేకపోవడంతో నీరు పూర్తిగా వేలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, చైన్నె మీదుగా సముద్రానికి చేరి పోతుందని వీటి వల్ల ఈ జిల్లాలోని రైతులు, ప్రజలు రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వాపోతున్నారు.

250 చెరువులకు జలకళ

తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 5 చెరువులు పూర్తిగా నిండగా, 124 చెరువుల్లో 50 శాతంపైగా నీరు చేరినట్టు పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోని ఊత్తుకోట డివిజన్‌లో 67 చెరువులు, కవరపేటలో 66, ఆరణిలో 28, పొన్నేరిలో 53, మీంజూరులో 38తో సహా మొత్తం 250 చెరువులు వున్నాయి. వీటిలో 5 చెరువులకు వంద శాతం, 8 చెరువులకు 75 శాతం, 26 చెరువులకు 70 శాతం, 124 చెరువుల్లో 50 శాతం నీరు, 87 చెరువుల్లో 25 శాతం నీరు చేరినట్టు ఽఅధికారులు తెలిపారు.

ఆనకట్ట నుంచి భారీగా నీరు విడుదల

జిల్లాలోని వేర్వేరు అనకట్టలు పూర్తిస్థాయిలో నిండిన క్రమంలో మిగులు జలాలను అధికారులు విడుదల చేస్తున్నారు. సురుటుపల్లి అకనట్ట నుంచి 1,670 క్యూసెక్‌లు, చిత్రపాక్కం అనకట్ట నుంచి 2915 క్యూసెక్‌లు, పనపాక్కం అనకట్ట నుంచి 1975 క్యూసెక్‌లు, కల్పట్టు చెక్‌డ్యామ్‌ నుంచి 1,354 క్యూసెక్‌లు, చెంగాత్తుకుళం డ్యామ్‌ నుంచి 1,210 క్యూసెక్‌లు, పాళేశ్వరం చెక్‌డ్యామ్‌ నుంచి 787.99 క్యూసెక్‌లు, ఏఎన్‌కుప్పం అనకట్ట నుంచి 1500 క్యూసెక్‌లు, లక్ష్మీపురం అనకట్ట నుంచి 1,639 క్యూసెక్‌లు, రెడ్డిపళ్యం చెక్‌డ్యామ్‌ నుంచి 1,692 క్యూసెక్‌లు, ఆండార్‌మఠం డ్యామ్‌ నుంచి 1,802 క్యూసెక్‌ల నీరు దిగువకు వెళ్తున్నట్లు వివరించారు. కాగా జిల్లాలోని 10 ఆనకట్టల్లో 927.91 మిలియన్‌ ఘణపరిమాణంలో నీటినిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

పాలారు నదిలో నీటి ఉధృతి1
1/1

పాలారు నదిలో నీటి ఉధృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement