దర్శనానికి 2గంటలు బ్రేక్
తిరుత్తణి: స్కందషష్టి సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహణకు వీలుగా నాలుగు రోజుల పాటు ఉదయం రెండు గంటల పాటు స్వామి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బుధవారం స్కంధషష్టి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు నిర్వహించే వేడుకలు సందర్భంగా రోజూ మూలవర్లకు విశిష్ట అభిషేకం అలంకరణతోపాటు దీపారాధన నిర్వహిస్తారు. కావడి మండపంలో ఉత్సవర్లు షణ్ముఖర్‌కు రోజూ ప్రత్యేక అలంకరణలో లక్షార్చన నిర్వహిస్తారు. స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహణకు వీలుగా బుధవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనభాగ్యం నిలిపి ఆలయ అర్చకులు స్వామికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు తరువాత భక్తులకు యథాప్రకారం స్వామి దర్శనం అనుమతిస్తారని ఆలయ జాయింట్ కమిషనర్ రమణి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా స్కందషష్టి వేడుకల్లో రెండవ రోజైన గురువారం స్వామికి ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు లక్షార్చన పూజలు నిర్వహించారు.
దర్శనానికి 2గంటలు బ్రేక్


