కోర్టుకు సీబీఐ ప్రాథమిక నివేదిక
సాక్షి, చైన్నె: కరూర్ ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను స్థానిక కోర్టులో గురువారం సీబీఐ దర్యాప్తు బృందం సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిపై నవంబర్ 2న విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వివరాలు.. గత నెల 27వ తేదీన కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం తొలుత విచారించింది. ఆ తదుపరి కేసు సీబీఐకు చేరింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క మిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, ఇందులో ఇద్దరు తమిళనాడు కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారులుగా ప్రకటించారు. తాజాగా కేసును గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో ఎడీఎస్పీ ముఖేష్‌కుమార్, డీఎస్పీరామకృష్ణన్‌తో సహా ఆరుగురితో కూడిన సీబీఐ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు పర్యవేక్షణ కమిటీలో తాజాగా ఇద్దరు అదనపు డీజీపీ స్థాయి అధికారులను నియమించారు. ఇందులో ఒకరుబీహార్‌లో పనిచేస్తున్న తమిళనాడు కేడర్‌కు చెందిన అదనపు డీజీపీ సుమీత్ శరణ్ కాగా, మరొకరు ఛత్తీస్‌గడ్‌లో పనిచేస్తున్న సోనాల్ వీ మిశ్రా ఉన్నారు. ఈ పరిస్థితులలో గత కొద్దిరోజులుగా కరూర్‌లో తిష్ట వేసిన సీబీఐ అధికారుల బృందం ప్రాథమికంగా ఓ నివేదికను తయారుచేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక మాధ్యమాలలో వెలుగుచూసినఅంశాల ఆధారంగా కరూర్ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి స్థానికకోర్టులో సమర్పించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిపై నవంబర్ 2న కోర్టు విచారణ ప్రారంభించనుంది. ఈ నివేదికలో సామాజిక మాధ్యమాలలో విజయ్ పర్యటనకు సంబంధించిన సమాచారాలు, ఇతర వివరాలు,సంఘటన తదుపరి సామాజిక మాధ్యమాలలో జరిగిన పలు అంశాలను పరిగణించి సమగ్రంగా వివరించినట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఈ ఘటనతో వాయిదా పడ్డ విజయ్ మీట్‌ది పీపుల్ రోడ్ షో పర్యటనలు ఇక, బహిరంగ సభల రూపంలో నిర్వహించేందుకు కసరత్తులలో తమిళగ వెట్రి కళగం వర్గాలు నిమగ్నమయ్యారు. నవంబర్‌లో విజయ్ పర్యటన మళ్లీ మొదలు పెట్టే దిశగా రూట్‌మ్యాప్ సిద్ధంచేస్తున్నారు.


