పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం
సాక్షి, చైన్నె: పారిశుధ్య కార్మికుల కోసం కొత్త పథకం అమలులోకి రానుంది. తొలి విడతగా చైన్నెలో ఈ పథకం ప్రవేశ పెట్టనున్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు ఉదయం వేళలో అల్పాహారం అందించనున్నారు. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, తూత్తుకుడి తదితర కార్పొరేషన్లలో లక్షలాది మంది శుభ్రత పనులలో పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ చైన్నెలోని పదిహేను మండలాలలో వేలాది మంది విధులలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఉదయాన్నే విధులకు వచ్చేకార్మికులు అల్పాహారం స్వీకరించడం లేదన్న సమాచారం సీఎం స్టాలిన్ దృష్టికి చేరింది. దీనిపై పరిశీలన జరుపుతున్న సమయంలో చైన్నెలో శుభ్రత పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు పోరుబాట బట్టారు. దీంతో కార్మికులను బుజ్జగించేందుకు మంత్రులు, అధికారులు తీవ్రంగా యత్నించారు. చివరకు వీరి పోరాటాన్ని భగ్నం చేశారు. అయితే సీఎం స్టాలిన్ మాత్రం కార్మికుల సమస్యలు, విన్నపాలపై స్పందించారు. పారిశుద్ద్య కార్మికుల సంక్షేమార్థం ఆరు వరాలను ప్రకటించారు. దీంతో కార్మికులు ఆనందం, హర్షం వ్యక్తం చేశారు. ఇందులో తొలి వరంగా అల్పాహార పథకం అమలులోకి రానుంది. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్‌లో తొలి విడతగా ఈ పథకం నవంబర్‌లో అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం అమలు కోసం రూ. 186 కోట్లను మూడు సంవత్సరాలకు గాను కేటాయించారు. ఈ పథకం మేరకు గ్రేటర్ చైన్నెలో 29,455 మంది పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించనున్నారు. తదుపరి క్రమంగా అన్ని కార్పొరేషన్లకు ఈ పథకం విస్తరించే విధంగా కార్యాచరణలో అధికారులు ఉన్నారు.


