డీఎంకే ఎమ్మెల్యే పొన్ను స్వామి హఠాన్మరణం
సాక్షి, చైన్నె: నామక్కల్‌జిల్లా సేంతమంగళం డీఎంకే ఎమ్మెల్యే కె. పొన్నుస్వామి(74) గురువారం గుండె పోటుతో హఠాన్మరణం పొందారు. ఈ సమాచారంతో డీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తన సంతాపం తెలియజేశారు. నామక్కల్ జిల్లాకు చెందిన పొన్ను స్వామి 2006 నుంచి సేంతమంగళం నియోజకవర్గం నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన 2006లో ఓమారు, 2021లో మరో మారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కొల్లిమలై ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం నామక్కల్‌కు తరలించారు. అయితే ఆయన మరణించినట్టు నామక్కల్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో తీవ్ర విషాదం డీఎంకేలో నెలకొంది. పులియంకాడులోని పొన్నుస్వామి స్వగ్రామంలో భౌతికకాయాన్ని ఉంచారు. ఈ సమాచారంతో మంత్రి మదవివేందన్, డీఎంకే ఎంపీలు వీఎస్ మాదేశ్వరన్, రాజేష్‌కుమార్‌తో పాటూ నామక్కల్ జిల్లాలోని డీఎంకే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సేంతమంగళంకు చేరుకున్నారు. పొన్నుస్వామి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. పొన్ముస్వామి మరణంతో డీఎంకే అధ్యక్షుడు,సీఎం స్టాలిన్ సంతాపం తెలియజేశారు. రెండుసార్లు ప్రజలు ఆయన్ని అసెంబ్లీకి పంపిచారని గుర్తుచేశారు. కలైంజ్ఞర్ కరుణానిధిపై అత్యంత అభిమానం కలిగిన పొన్ముస్వామి ఇక లేరన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన్ని కోల్పోయి తీవ్ర శోకంలో ఉన్నకుటుంబ సభ్యులకు, సేంతమంగళం నియోజకవర్గ ప్రజలకు తనసంతాపం, సానుభూతిని తెలియజేశారు. ఇక డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మంత్రులు ఏవీ వేలు, శివశంకర్, రాజేంద్రన్, అన్బిల్ మహేశ్, మాజీ మంత్రి సెంథల్ బాలాజీలు సేంతమంగళంకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి అంజలి ఘటించారు. మరణించిన పొన్నుస్వామికి భార్య జయమణి,కుమారుడుమాదేష్, కుమార్తె పూమలర్ ఉన్నారు.


