
అభివృద్ధి పనులు వేగవంతం
వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వేలూరు జిల్లా అభివృద్ధి పనుల కమిటీ చైర్మన్, వేలూరు ఎంపీ కదిర్ ఆనంద్ అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో ఆ కమిటీ సభ్యులు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నాయని వీటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం వర్షాలు విరివిగా కురుస్తున్నందున వేలూరు కార్పొరేషన్‌లో వర్షపు నీరు చేరి ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణ కట్టడాలు, పాఠశాల భవనాలు వంటి అభివృద్ధి పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో సంవత్సరాల తరబడి భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతున్నందున పట్టణంలోని రోడ్డులు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నందున వెంటనే పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పనితీరు, ప్రస్తుతం ఈ పనులు ఏస్థాయిలో ఉందనే వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జగన్‌మూర్తి, విల్వనాథన్, మేయర్ సుజాత, అటవీశాఖ జిల్లా అధికారి అశోక్‌కుమార్, డీఆర్‌ఓ మాలతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.