
ఘనంగా పాఠశాల వజ్రోత్సవం
పళ్లిపట్టు: పొదటూరుపేట ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలను పూర్వవిద్యార్థుల సంయుక్త కృషితో చేపట్టి పాఠశాలకు రూ.15 లక్షలతో సదుపాయాలు కల్పించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకోవాలని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. ఇందుకుగాను ఆ పాఠశాలలో చదవి దేశ విదేశాల్లో వివిధ పదవులో ఉన్న వారితో కలిసి పాఠశాలకు తమ వంతు సాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పూర్వవిద్యార్థుల ద్వారా స్వచ్ఛందంగా రూ.25లక్షలు ఇచ్చారు. ఆ మొత్తం డబ్బుతో పాఠశాలలో ఏసీ, స్మార్ట్ తరగతి గదులు, గదులకు ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు సహా పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరిచారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో శిలాఫలకం ఏర్పాటుతోపాటు ఆర్చి సైతం నిర్మించారు. మంగళవారం పాఠశాలలో వజ్రోత్సవాలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం మోదరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ కన్నప్పన్, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్, టౌన్ పంచాయతీ చైర్మన్ రవిచంద్రన్ పాల్గొని పూర్వవిద్యార్థుల సేవాభావాన్ని, మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.

ఘనంగా పాఠశాల వజ్రోత్సవం