
వేలూరు కొత్త బస్టాండ్‌లో రద్దీ
వేలూరు: దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటూ సెలవు ప్రకటించింది. దీంతో చైన్నె, బెంగుళూరు, విల్లుపురం, కోవై, సేలం వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, గత శనివారం సొంత గ్రామాలకు చేరుకున్నారు. సెలవులు పూర్తి కావడంతో వేలూరు కొత్త బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు బస్సుల్లో రద్దీని చూసి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు మంగళవారం సాయంత్రంతో పాటూ బుధవారం ఉదయం ఒక్కసారిగా వేలూరు కొత్త బస్టాండ్ చేరుకొని చైన్నె, బెంగళూరు, సేలం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించడంతో బస్టాండ్ ప్రాంతం పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఇదిలా ఉండగా రాజస్థాన్, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో కాట్పాడి రైల్వే స్టేషన్‌లోనూ రద్దీ కనిపించింది. అదేవిధంగా మంగళవారం సెలవు రోజు కావడంతో వేలూరు కోట మైదానంలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో చేరుకొని కాలక్షేపం చేశారు. దీంతో వేలూరు కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, కోట మైదానం ఆవరణలో ప్రయాణికులతో కిటకిటలాడింది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తూనే ఉండడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.