తిరుత్తణిలో రోజంతా వర్షం
పళ్లిపట్టు: తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వీడని వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువుల్లోకి నీరు వేగంగా చేరుతోంది. ప్రజా పనుల శాఖకు చెందిన 26 చెరువులు పూర్తిగా నిండినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా కృష్ణాపురం జలాశయం పూర్తి సామర్ధ్యం నిండడంతో డ్యాం నుంచి బుధవారం సాయంత్రం రెండు వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేశారు. దీంతో కుశస్థలి పొంగి ప్రవహిస్తోంది. సామంతవాడ వద్ద కల్వర్టు రెండుగా కూలింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అధికారులు ముందు జాగ్రత్తగా కల్వర్టుకు ఇరు వైపులా మట్టిని నింపి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అదే విదంగా తిరుత్తణి ప్రాంతంలోని నంది నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.


