వేలూరు, తిరువణ్ణామలైలో భారీ వర్షాలు
నేలమట్టమైన అరటి, వరి పంటలు కనసల్‌పేటలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు నిండిన 26 చెరువులు కుశస్థలి నదిలో కూలిన కల్వర్టు
వేలూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో వేలూరు, తిరువణ్ణామలైలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో 2 రోజుల పాటూ ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రోడ్లు, వీధులన్నీజలమయం అయ్యాయి. అదేవిధంగా వర్షపు నీరు వేలూరు నేతాజీ మార్కెట్‌లోకి చేరుకోవడంతో వ్యాపారులు, కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 రోజులుగా ఉదయం నుంచి వర్షాలు విడవకుండా కురుస్తుండడంతో విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఇదిలా ఉండగా కార్మికులు, ఉద్యోగస్తులు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా వర్షం కారణంగా వేలూరు గ్రీన్ సర్కిల్, కొత్త బస్టాండ్, బజారు వీధి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడి వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలూరు పట్టణంలోని కన్‌సాల్‌పేటలో సుమారు 40 ఇళ్లలోకి వర్షపు నీటితో పాటూ డ్రైనేజీ కాలువ నీరు చేరడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి నీటిని విద్యుత్ మోటార్లు ద్వారా నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. రాణిపేట జిల్లాలో సంవత్సరాల తరబడి ఉన్న చింత చెట్టు నేల కొరగడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వెంటనే చెట్లను నరికి తీసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. కన్నమంగళం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యారు, ఆరణి, తిరువణ్ణామలై, పోలూరు, తండ్రాంబట్టు వంటి ప్రాంతాల్లోను రెండు రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలన్ని జలమయమైంది. సందవాసల్, పడవేడు, పుష్పగిరి, కాట్పాడి వంటి ప్రాంతాల్లోని అరటి, వరి పంటలు పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పూండి రిజర్వాయర్ నుంచి
మిగులు జలాల విడుదల
తిరువళ్లూరు: పూండి రిజర్వాయర్‌కు భారీగా మిగులు జలాలు వస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్ నుంచి దిగువకు మరింత నీటిని విడుదల చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూండిలో సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ వుంది. ఆంధ్ర కండలేరు నుంచి వచ్చే జలాలతో పాటూ వరద నీటిని నిల్వ వుంచి చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. రిజర్వాయర్ మొత్తం నీటిమట్టం 35 అడుగులు. ఇక్కడ మూడున్నర టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇటీవల రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చిన క్రమంలో పూర్తిస్థాయికి చేరింది. దీంతో రిజర్వాయర్ బద్రతను దృష్టిలో ఉంచుకుని 700 క్యూసెక్‌ల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో మరింత పెరిగిన క్రమంలో సెకనుకు 4,500 క్యూసెక్‌ల నీటిని బుధవారం సాయంత్రం నుంచి విడుదల చేశారు. దీంతో షట్టర్‌లను దాటుకుని నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. పూండి రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో కరకట్ట ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను అధికారులు ముమ్మరం చేశారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాలకు నీరు చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నివాసాల చుట్టూ నీరు చేరిన క్రమంలో అత్యవసర సేవలకూ వెళ్లలేకపోతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా నత్తంబేడు గ్రామంలో గణపతి నగర్, శబరి నగర్ ప్రాంతాలు వున్నాయి. ఇక్కడ సుమారు 500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గతంలో ఇక్కడ నిలిచే వర్షపు నీరు సమీపంలోని అప్పలగుంటకు చేరేది. అయితే అప్పల గుంటకు వెళ్లే కాలువను కొందరు ఆక్రమించుకోవడంతో నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక రాత్రి సమయంలో విష సర్పాలు సైతం సంచరిస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించిన నివాసాలకు చేరిన నీటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.


