తిరుచెందూరులో స్కంధషష్టి ఉత్సవాలు
సాక్షి, చైన్నె: తిరుచెందూరులో స్కంధషష్టి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆరుపడైవీడులలో రెండోదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జయంతినాదర్‌గా కొలువైన స్వామి వారికి ప్రతిఏటా స్కంధషష్టి అత్యంత వేడుకగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు యాగశాల పూజలతో బుధవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మఖ్యమైన ఘట్టం ఆరో రోజు జరిగే సూరసంహారం తిలకించేందుకు దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తారు. సముద్ర తీరంలో జరిగే ఈవేడుక నిమ్తితం ఏర్పాట్లపై తూత్తుకుడి జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది.
ప్రభుత్వ బస్సు బోల్తా
–21 మందికి గాయాలు
అన్నానగర్: దిండివనం సమీపం జక్కంపేటలో బుధవారం తెల్లవారుజామున ప్రభుత్వ బస్సు బోల్తా పడి 21 మంది గాయపడ్డారు. అరందాంగి నుంచి మంగళవారం 53 మంది ప్రయాణికులతో ఒక ప్రభుత్వ బస్సు చైన్నెకి బయలుదేరింది. అరదాంగికి చెందిన రాజపాండి (53) డ్రైవర్‌గా, అదే ప్రాంతానికి చెందిన మణివన్నన్ (45) కండక్టర్‌గా విధుల్లో ఉన్నారు. ఈ స్థితిలో బస్సు బుధవారం తెల్లవారుజామున దిండివనం సమీపం జక్కంపేట వద్ద వెళుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 21 మంది గాయపడ్డారు. గాయపడ్డ వీరిని దిండివనం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మయిలం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ట్రాఫిక్‌ను మళ్లించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైకులో మద్యం తరలింపు
–ఒకరి అరెస్ట్
తిరుత్తణి: బైకులో మద్యం తరలించిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపం చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో మురకంబట్టు వద్ద పోలీసులు బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆసమయంలో బైకులో వచ్చిన వ్యక్తి వద్ద తనిఖీ చేశారు. తనిఖీల్లో 38 మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం బాటిళ్లతోపాటు బైకును స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తిరుత్తణి పోలీసుల విచారణలో అతను మురకంబట్టుకు చెందిన మునికృష్ణన్(25) అని తెలిసింది. ఇతను మద్దూరులోని టాస్మాక్ దుకాణంలో మద్యం బాటిళ్లు తీసుకుని ఇంట్లో వుంచి అదనపు ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో మునికృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


