కారు బోల్తా: ఇద్దరు దుర్మరణం
అన్నానగర్: కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన కరూర్‌లో చోటుచేసుకుంది. కరూర్ జిల్లా కరుపంపాలయంలోని అగ్రహార వీధికి చెందిన లోకనాథన్ కుమారుడు నితీష్ కన్నన్ (23). ఇతను ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం తన ముగ్గురు స్నేహితులు తిరునెడుంగణనాథన్ (21), ధనుష్ (21), శివరాజన్ (24)లతో కలిసి సేలం–కరూర్ జాతీయ రహదారిపై కారులో వెళుతున్నారు. ఆ సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తిరునెడుంగననాథన్, శివరాజన్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మదురై సమీపంలోని తువారిమాన్ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (22) తన స్నేహితుడు కన్నన్ (27)తో కలిసి తిరుమంగళం–రాజపాళయం రహదారిపై బైక్‌లో వెళుతున్నాడు. బైక్ అదుపుతప్పడంతో వంతెనపై నుంచి పడిన విఘ్నేష్ వంతెన నిర్మాణం కోసం ఉపయోగించిన ఇనుప కడ్డీలలో చిక్కుకుని మృతిచెందాడు. కన్నన్ తీవ్ర గాయలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


