తిరువళ్లూరులో భారీ వర్షం
– జనజీవనం అస్తవ్యస్తం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. దీంతో పెద్దకుప్పం, వైష్ణవీనగర్, హంసానగర్, వేపంబట్టులోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వీరరాఘవుడి ఆలయం, మార్కెట్ వీధుల్లో మురుగునీటితో కలిసి వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో దుర్వాసన వెదజల్లింది. జిల్లాలో అత్యధికంగా గుమ్మిడిపూండిలో 6సెం.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా పళ్లిపట్టు ఆర్కేపేట ప్రాంతాల్లో 5 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తానికి 263.80 మి.మీ వర్షపాతం సరాసరిన 17.59 శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
రిజర్వాయర్‌ల నీటి మట్టం..
చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌ల నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. రెడ్‌హిల్స్ రిజర్వాయర్ మొత్తం నీటి సామర్ద్యం 21.20 అడుగులు కాగా ప్రస్తుతం 18.61 అడుగుల మేరకు నిల్వ వుంది. చోళవరం రిజర్వాయర్ మొత్తం నీటి సామర్ద్యం 18.86 అడుగులు కాగా ప్రస్తుతం 10.04 అడుగుల నీరు నిల్వ వుంది. చెమరంబాక్కంలో రిజర్వాయర్ నీటి మట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం 21.20 అడుగులకు నీరు చేరింది. చైన్నెకి తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ సత్యమూర్తిసాగర్ పూండి మొత్తం నీటి సామర్ద్యం 35 అడుగులు కాగా ప్రస్తుతం 33 అడుగుల మేరకునీరు నిల్వ వుంది. కన్నన్‌కోట–తేరువాయి కండ్రిగ రిజర్వాయర్‌లో మొత్తం 36.61 అడుగుల నీటిని నిల్వ చేసుకునే అవకాశం వుండగా ప్రస్తుతం 34.37 అడుగుల నీరు నిల్వ వుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన రిజర్వాయర్‌ల నీటి మట్టం పూర్తి స్థాయికి చేరగా, చెరువులకు నీరు పెరిగింది.


