
● నాలుగురోజుల పాటూ సమావేశాలు ● స్పీకర్ అప్పావు వెల్లడి
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం స్పీకర్ అప్పావు ప్రకటించారు. నాలుగు రోజులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరిలో గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల తదుపరి అసెంబ్లీ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఏప్రిల్ 24 నుంచి మే 21వ తేదీ వరకు శాఖల వారీగా నిధుల కేటాయింపునకు సంబంధించిన చర్చ తదుపరి సమావేశాన్ని స్పీకర్ వాయిదా వేశారు. తాజాగా ఆదాయ వ్యయాలకు సంబంధించిన అనుబంధం నివేదికను సభలో దాఖలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సభను సమావేశ పరిచేందుకు నిర్ణయించారు. ఈమేరకు సభా వ్యవహారాల కమిటీ సమావేశం ఉదయం స్పీకర్ అప్పావు నేతృత్వంలో అసెంబ్లీ ఛాంబర్‌లో జరిగింది. ఇందులో మంత్రులు దురై మురుగన్, తదితరులు, అన్నాడీఎంకే తరపున ఆర్‌బీ ఉదయకుమార్, పీఎంకే తరపున జీకేమణి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను స్పీకర్ అప్పావు ప్రకటించారు. మంగళశారం సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగుతాయని, తొలి రోజున సంతాప తీర్మానాలు ఉంటాయని వివరించారు. కరూర్ బాధితులకు నివాళులర్పించే విధంగా ప్రత్యేక సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నామన్నారు. కేరళ మాజీ సీఎం అచ్యుదానందం మృతికి సైతం సంతాపం తీర్మానం ఉంటుందన్నారు. ఈ ఏడాది చివరి సమావేశం ఇదే అని పేర్కొంటూ, ఇందులో పలు ముసాయిదాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. 15వ తేదీన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అనుబంధ నివేదిక దాఖలు, 16వ తేదీన చర్చ, 17న ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయన్నారు. కాగా ఇప్పటికే గాజాలో యుద్ధం ఆపడం, అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కేంద్రంపై ఒత్తిడితెచ్చే విధంగా తీర్మానం తీసుకు వస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అసెంబ్లీలో కరూర్ ఘటన వ్యవహారం చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు అన్నాడీఎంకే, బీజేపీ వంటి వివక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి.