
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
వేలూరు: వేలూరు గ్రీన్‌సర్కిల్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మయిల్‌వాగనం అన్నారు. సోమవారం ఉదయం గ్రీన్ సర్కిల్‌లో తరచూ ఉంటున్న ట్రాఫిక్‌ను ఎస్పీతోపాటు కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్‌లు తనఖీ చేశారు. గ్రీన్ సర్కిల్ ప్రాంతంలో వర్షం వస్తే నీరు చేరడంతో ప్రతి రోజూ వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా రోడ్డుకు ఇరు వైపులా ఆక్రమణలు లేకుండా ఇప్పటికే తొలగించడం జరిగిందన్నారు. అనంతరం గ్రీన్ సర్కిల్ ప్రాంతంలోని కుడి, ఎడమ రోడ్డులతోపాటు కొత్త బస్టాండ్, నేషనల్ థియేటర్ సర్కిల్, సీఎంసీ ఆసుపత్రి రోడ్డు, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆయన తనఖీ చేశారు. వీటిపై సంబంధిత అధికారులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూస్తామన్నారు. ఆయనతో పాటు పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసన్, పోలీసులు, కార్పొరేషన్ అధికారులున్నారు.