
తమిళంలో నటించడమే ఘనం
తమిళసినమా: నటి మమతా మోహన్‌దాస్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ మలయాళీ భామ మాతృభాషలోనే కాకుండా, తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో కథానాయకిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క, ఎనిమి, మహారాజా తదితర చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ మధ్య అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధికి గురై చాలా బాధ పడ్డారు. చివరికి ఆ మహ్మమారిపై పోరాడి గెలిచారు. ఆ తరువాత మళ్లీ తన దృష్టిని నటనపై సారించారు. ఇటీవల విజయ్ సేతుపతితో కలిసి నటించిన మహారాజా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా నటుడు అరుళ్‌నిధి హీరోగా నటిస్తున్న మై డియర్ సిస్టర్ అనే చిత్రంలో ఆయనకు అక్కగా నటిస్తున్నారు. దీని గురించి నటి మమతా మోహన్ మాట్లాడుతూ ఇది ఒక అసాధారణ యువతి జీవిత పోరాటం అని చెప్పారు. ఇందులో తాను ట్రక్కర్ క్రాఫ్ట్ డ్రైవర్‌గా నటించినట్లు చెప్పారు. ఈ పాత్ర కోసం టస్కీ రంగు పూసుకుని నటించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను తిరునల్వేలి, తూత్తుక్కుడి ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యంగా నెల్‌లై ప్రాంత తమిళ భాష తనను బాగా ఆకట్టుకుందన్నారు. తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ప్రేక్షకులు అందించారని పేర్కొన్నారు. దాన్ని కాపాడుకోవడానికి పోరాడతానని అన్నారు. తాను ఎన్ని భాషా చిత్రాల్లో నటించినా తమిళ సినిమాల్లో నటించడం ఘనంగా భావిస్తానన్నారు. ఇక్కడి అభిమానులు అందించే ప్రేమాభిమానాలు ఏ భాషలోనూ చూడలేమని గత రెండు దశాబ్దాలుగా నటిగా, గాయనిగా, నిర్మాతగా రాణిస్తున్న 40 ఏళ్ల మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు.
నటి మమతా మోహన్