
బైసన్‌తో సమాజంపై ప్రభావం
తమిళసినిమా: పరియేరుమ్ పెరుమాళ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మారిసెల్వరాజ్ ఆ చిత్ర విజయంతో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఈయన నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం బైసన్. నటి అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్, దర్శకుడు అమీర్, పశుపతి, కలైయరసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్నా సంగీతాన్ని అందించారు. దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న బైసన్ చిత్రం ఈ నెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర ప్రిరిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన మెడ్రాస్ చిత్రం గురించి మారి సెల్వరాజ్‌కు విమర్శ ఉన్నట్లు చెప్పి దర్శకుడు రామ్ ఆయన్ని తన వద్దకు పంపారన్నారు. అలా పరిచయమైన మారిసెల్వరాజ్ తొలి చిత్రం పరియేరుమ్ పెరుమాళ్ కంటే బైసన్‌తో చాలా ఎత్తుకు ఎదిగారని ప్రశంసించారు. నటుడు ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ తన తండ్రితో తనను పోల్చుకోవడం సాధ్యం కాదనీ, అయినప్పటికీ ఆయనలా నటించాలని ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. బైసన్ చిత్రంలో నటించే అవకాశం కల్సించినందుకు తన గురువు మారిసెల్వరాజ్‌కు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రం కోసం రెండు, మూడేళ్లు వేచి ఉన్నానని ఇక్కడ కొందరు చెప్పారనీ, అయితే ఈ చిత్రం కోసం పదేళ్లు అయినా ఎదురు చూస్తానని అన్నారు. బైసన్ చిత్ర షూటింగ్‌లో మారిసెల్వరాజ్ టేక్ ఓకే అని చెప్పగానే తనకు జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్ కలిగేదని ధ్రువ్ విక్రమ్ పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు మారిసెల్వరాజ్ మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారుడు మణత్తీ గణేశన్ బయోపిక్‌ను బైసన్ చిత్రం ద్వారా చెప్పాలని భావించానన్నారు. దీంతో ఆయన్ని కలిసి ఆయన జీవిత చరిత్రను రాజకీయాలతో కలిపి ఎందుకు చిత్రంగా రూపొందించకూడదని అడిగానన్నారు. అందుకు ఆయన ఒక విషయం చెబితే బాగానే ఉంటుందని అంగీకరించినట్లు చెప్పారు. తాను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాననీ, ఆర్థికంగా కూడా బలపడ్డాననీ, అయితే ప్రజల కోసం ఏం చేశానన్నదానికి సమాధానమే ఈ చిత్రమని పేర్కొన్నారు. తన భావోద్వేగం, గర్వం ఈ చిత్రం అని చెప్పారు. దక్షిణ తమిళనాడు రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రం బైసన్ అని పేర్కొన్నారు. ఈ చిత్రం విజయాన్ని పక్కన పెడితే సమాజంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు మారి సెల్వరాజ్ వ్యక్తం చేశారు.

బైసన్‌తో సమాజంపై ప్రభావం