
మూడోసారి హిట్ కాంబో?
తమిళసినిమా: ఒక చిత్రం హిట్ అయితే దానికి సీక్వెల్‌ను రూపొందించడం ఇటీవల అధికమవుతోందనే చెప్పాలి. అలా నటుడు రజనీకాంత్‌ను సమీప కాలంలో దర్బార్, అన్నాత్తే వంటి ఫ్లాప్‌ల నుంచి బయట పడేసిన చిత్రం జైలర్. నెల్సన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తరువాత రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన కూలీ చిత్రం అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో జైలర్–2 చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకూ పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్, గ్లింప్స్ వంటివి విడుదలై చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన చంద్రముఖి, బాషా వంటి చిత్రాలకు సీక్వెల్స్‌లో నటించమని కోరినా నో అని చెప్పిన రజనీకాంత్ జైలర్ చిత్రానికి సీక్వెల్‌లో నటించడం విశేషం. ఇకపోతే ఈ చిత్రం తరువాత ఆయన నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దానికి సమాధానంగా ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రజనీకాంత్ మూడోసారి దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. జైలర్–2 చిత్ర షూటింగ్ సమయంలో రజనికాంత్‌కు దర్శకుడు నెల్సన్ ఒక కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చినట్లు టాక్ వైరల్ అవుతోంది. జైలర్–2 చిత్రం తరువాత మళ్లీ నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. అయితే దర్శకుడు నెల్సన్ తదుపరి ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ అనధికార ప్రచారానికి బదులు రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.