
నిండిన పింజివాక్కం ఆనకట్ట
తిరువళ్లూరు: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఆంధ్ర నుంచి విడుదల చేసిన మిగులు జలాలతో కూవం నదిలో వరద మొదలైంది. ఈ క్రమంలో పింజివాక్కం ఆనకట్ట పూర్తిగా నిండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఆంధ్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు నిండి మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు. ఈ నీరు వేలూరు మీదుగా వచ్చి కేశవరం డ్యామ్ నిండి అక్కడి నుంచి మిగులు జలాలు కూవం నదికి చేరింది. ఈ నీటి ఉధృతికి గత మూడు రోజుల క్రితం సత్తరై వద్ద బ్రిడ్జి సైతం కొట్టుకుపోయింది. దీంతోపాటు నీటి ఉధృతి మరింత పెరిగింది. ఇందులో భాగంగానే కడంబత్తూరు యూనియన్ పింజివాక్కం వద్ద కూవం నదిలో నిర్మించిన డ్యామ్ పూర్తిగా నిండింది. దీంతో స్తానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనకట్ట నిండడం ద్వారా పింజివాక్కం, పింజివాక్కం కండ్రిగ, అగరం, పుదుమావిలంగై, సత్తరై తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని ఆయా గ్రామస్తులు వ్యాఖ్యానించారు.