
వాళ్లకు ఈర్ష్య ఎక్కువ
● పళణి వ్యాఖ్య
సేలం: టీవీకే నేత విజయ్ ఎక్కడ తమతో చేతులు కలిపేస్తారో..? అన్న భయం కొన్ని పార్టీలకు ఉన్నాయని, అందుకే ఈర్ష్యతో విమర్శలు గుప్పిస్తున్నాయని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి వ్యాఖ్యానించారు. సేలంలో ఆదివారం సెంజాయ పెరుమాల్ ఆలయంలో పూజలునిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయ్ పార్టీ జెండాలను పనిగట్టుకుని అన్నాడీఎంకే వర్గాలు పళణి సభలలో ప్రదర్శిస్తున్నాయని అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, అదో పార్టీ, ఆ పార్టీ నేతకు తాను సమాధానం ఇవ్వాలా? అంటూ చురకలు అంటించారు. పార్టీ అధ్యక్షుడి అనుమతితో జెండాలను ప్రదర్శించాలని తాను సభలో స్పష్టంగా తెలియజేశానన్నారు. అయితే, వారు ఉత్సాహంతో టీవీకే జెండాలతో వస్తున్నారని వ్యాఖ్యలుచేశారు. అన్నాడీఎంకే జెర్సీలతో జెండాలను ప్రదర్శిస్తున్నారే అని ప్రశ్నించగా, ఇది కొన్ని పార్టీల కుట్ర అని సమాధానం ఇచ్చారు. విజయ్ ఎక్కడ అన్నాడీఎంకేతో చేతులు కలుపుతారో అన్న బెంగ, భయం కొన్ని పార్టీలకు ఉన్నాయని, అందుకే ఈర్ష్యతో విమర్శలు , ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవశ్యం తనకు లేదని, కొందరు దిగజారి ఎవరైనా తమను అక్కున చేర్చుకుంటారా..? అని ఎదురు చూసి భంగ పాటూ ఎదురు కాబోతోందని గ్రహించి విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా టీటీవీకి చురకలు అంటించారు.