తమిళసినిమా: నటుడు విమల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహాసేన. నటి సృష్టిదాంగే నాయకిగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, మహిమ గుప్తా, జాన్‌విజయ్, కబీర్ దుహాన్‌సింగ్, ఆల్ఫ్రెడ్ జోస్, ఇళక్య, విజయ్ సియోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు ఒక ఏనుగు కీలకపాత్రలో నటిస్తోంది. మరుదమ్ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై డాక్టర్ సెల్వరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను దినేష్ కలైసెల్వన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు సూరి, దర్శకుడు విజయ్‌మిల్టన్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. మీడియాకు విడుదల చేసిన కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ నేచర్ స్పిర్చువలిటీ, మైథాజికల్ అంశాలతో రూపొందిస్తున్న సస్పెన్‌న్స్ థ్రిల్లర్, యాక్షన్ ,అడ్వెంచర్ కథాచిత్రంగా మహాసేన ఉంటుందన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను 90 శాతం దట్టమైన అడవుల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రకృతి, దైవం, మనుషుల దురాశ పంటి అంశాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగును కడలూరు, వయనాడు, కొల్లిమలై, ఊటీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజువల్ పరంగా చిత్రం ప్రేక్షకులను కనువిందు చేస్తుందని అన్నారు. చక్కని మెలోడీతో కూడిన డివోషనల్ పాటలు రంజింప చేసే విధంగా ఉంటాయని చెప్పారు. చిత్రంలోని నాలుగు పాటలకు సంగీత దర్శక ద్వయం ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఎన్.అరుణగిరి అద్భుతమైన బాణీలను కట్టినట్లు చెప్పారు. డీఆర్‌మానస్ బాబు చాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
విమల్ హీరోగా మహాసేన