
కోర్టు నేపథ్యంగా విల్
తమిళసినిమా: కోర్టులో రకరకాల కేసులు విచారణకు వస్తుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తికరంగానూ, జటిలంగానూ ఉంటాయి. అలా పలు ఆసక్తికరమైన కోణాలను ఆవిష్కరించే కథా చిత్రం విల్. పలు మలుపులు తిరిగే ఒక ఆసక్తికరమైన కేసు విచారణకు వస్తుంది. ఒక ఖరీదైన ఫ్లాట్ గురించి వివాదం జరుగుతుంది. ఆ ఫ్లాట్ తనకు సొంతం అంటూ ఒక యువతి కోర్టుకు విజ్ఞప్తి చేస్తుంది. ఆమైపె సందేహం కలగడంతో న్యాయమూర్తి ఆ కేసుపై పూర్తిగా దర్యాప్తు నిర్వహించాలని ఒక పోలీస్ అధికారికి బాధ్యతలను అప్పగిస్తారు. ఆయన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి చేయని తప్పునకు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తండ్రిని జైలు పాలు కాకుండా చేయడానికి ఒక కూతురు ఏం చేసింది? న్యాయస్థానంలో జరుగుతున్న కేసుకు ఈ యువతికి సంబంధం ఏమిటి? ఆ ఫ్లాట్ తనదని చెప్పిన యువతి ఎవరు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం విల్. ఇందులో న్యాయమూర్తిగా సోనియాఅగర్వాల్ నటించగా పోలీసు అధికారిగా విక్రాంత్ నటించారు. ఇంకా ప్రధాన పాత్రలో అలైఖ్య అనే విశాఖపట్నంకు చెందిన యువతి నటించారు. ఈమె చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ చిత్రం ద్వారా సోనియాఅగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.