
నిఘా నీడలో నాగేంద్రన్ అంత్యక్రియలు
సాక్షి, చైన్నె: నిఘా నీడలో రౌడీ నాగేంద్రన్ అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. కాగా తండ్రి మృత దేహం వద్ద నాగేంద్రన్ చిన్న కుమారుడు అజిత్ రాజ్ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రహస్యంగా అంత్యక్రియలకు వచ్చిన పాత నేరస్తుడు వెల్‌లై ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో ఏ –1గా ఉన్న రౌడీ నాగేంద్రన్ చైన్నెలోని ఆస్పత్రిలో అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అతడు ఈనెల 9వ తేదీన మరణించాడు. అయితే పోస్టుమార్టం నిర్వహణ వ్యవహారం కోర్టుకు చేరడంతో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు పోస్టుమార్టం పూర్తి చేసి ఆదివారం ఉదయాన్నే కుటుంబీలకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. వ్యాసార్పాడిలోని నివాసానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ ఆప్తులు, బంధువుల సందర్శనార్థం ఉంచారు. ఈ సమయంలో నాగేంద్రన్ చిన్నకుమారుడు అజిత్ రాజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన తండ్రి భౌతికకాయం సాక్షిగా షాహినా అనే యువతికి తాళి కట్టి తన జీవిత భాగస్వామి చేసుకున్నాడు. ఈ ఇద్దరు నాగేంద్రన్ మృతదేహం కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు రెండు వందల మందికి పైగా పోలీసులు ఆ పరిసరాలలో నిఘాతో వ్యవహరించారు. గట్టి భద్రత నడుమ వ్యాసార్పాడి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సమయంలో తన గురువైన నాగేంద్రన్‌ను కడసారి చూసుకునేందుకు రహస్యంగా వచ్చిన అతడి ప్రధాన అనుచరుడు, అజ్ఞాత నేరగాడు వెల్‌లై ప్రకాష్‌ను పోలీసులు పథకం ప్రకారం అరెస్టు చేశారు. ఈ సమయంలో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, పటిష్ట బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేయించారు.