
తిరుత్తణి ఆలయంలో కృత్తిక సందడి
తిరుత్తణి: మురుగన్ ఆలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. పెరటాసి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి వారికి వేకువజామున సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేసి, బంగారు కవచంతో అలంకరలించారు. అలాగే రుద్రాక్ష మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామివారు పుష్పాలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రా ల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మెట్లు మార్గంతో పాటు, ఘాట్ట్‌రోడ్డులో కొండకు చేరుకున్నారు. దీంతో ఆలయ మాడ వీధుల్లో భక్తజన సందడి నెలకొంది. సర్వ దర్శనం మార్గంలో రెండు గంటల పాటు, రూ. వంద ప్రత్యేక దర్శనంలో గంటపాటు వేచివుండి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సాయంత్రం వెండి నెమలి వాహనంలో ఉత్సవర్లు కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. ఉద యం నుంచి రాత్రి వరకు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని, మొక్కు లు చెల్లించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.