
పెద్ద కలలతో ఎదురుచూస్తున్నా!
తమిళసినిమా: పేరులోనే రాశిని పొందుపరచుకున్న నటి రాశిఖన్నా. కథానాయకిగానూ ఈమె రాశి బాగానే ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న ఈ భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అధర్వ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటి రాశిఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిట్రంపలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ఇక్కడ రాశిఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడం లేక ఇతర భాషల్లో నటించడంతో సమయం సరిపోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటున్నారు. అదేవిధంగా కోలీవుడ్లో మంచి చిత్రాల్లో నటించాలన్న కోరికను ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాశిఖన్నా తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులు ఇష్టపడే కథానాయకగా సినిమాల్లో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంకా పెద్ద పెద్ద కలలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాశిఖన్నా తెలిపారు
సామాజిక పోరాటం నేపథ్యంలో ఈగై
తమిళసినిమా: హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఈగై. అంజలి, సంతోష్ ప్రతాప్, టాలీవుడ్ నటుడు సునీల్, అర్జయ్, పొన్వన్నన్, అభిరామి, దీప, పుగళ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మార్క్ అనే కీలక పాత్రలో రోషన్ కనకరాజు పరిచయం అవుతున్నారు. అదేవిధంగా అరువి బాల, రూపిణులతో పాటు 25 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నట్లు దర్శకుడు అశోక్ వేలాయుధం చెప్పారు. ఈయన కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణమాచార్య రామభద్రన్, బృందకృష్ణ క్రియేషన్‌న్స్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తాను ఇంతకుముందు పలు భాషా చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసినట్లు చెప్పారు. ఈగై చిత్ర షూటింగ్‌ను ముంబై ,హైదరాబాద్, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించి 33రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పారు. చిత్రంలో రోషన్ కనకరాజు పాత్ర టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని చెప్పారు. ఇది ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. లా విద్యార్థి సామాజిక న్యాయం కోసం చేసే పోరాటమే ఈగై అని చెప్పారు. సామాజిక న్యాయం, రాజకీయ పరిణితి, ఆర్థిక పటిష్టత ఒక మనిషిని గౌరన పరుస్తాయని, అలాంటి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. చిత్రానికి దర్శకుడు భరతన్ సంభాషణలను, ధరణ్‌కుమార్ సంగీతాన్ని, శ్రీధర్ చాయాగ్రహణం అందిస్తున్నారు.