
దేశసేవకు ప్రాధాన్యం ఇవ్వాలి
తిరువళ్లూరు: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తరువాత దేశసేవకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వ క్రీడాభివృద్ధి ఆఽథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సీనియర్ ఐఏఎస్ జే.మేఘనాథరెడ్డి పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే కళాశాలలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంతో పాటు ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగాల పట్ల ఆసక్తి ప్రదర్శించాలన్న ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహించడానికి తరచూ పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు కీలక పదవుల్లో వున్న వారితో మోటీవేషన్ కార్యాక్రమం, సెమినార్‌ను కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అడ్మినిస్ట్రేటివ్ సేవలు– భవిష్యత్తు బాట పేరుతో ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. సెమినార్‌కు ఆర్‌ఎంకే విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు ఆర్‌ఎం కిషోర్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం సాధించాలనే విద్యార్థులు పట్టుదలతో ఇప్పటి నుంచే చదవాలని సూచించారు. మేఘనాథరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి డిగ్రీ తరువాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన వుండాలన్నారు. ఉద్యోగం సాధించాక తన కుటుంబంతో పాటు దేశసేవకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎంకే ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ మహ్మద్‌జునైద్, ఆర్‌ఎండీ కళాశాల ప్రిన్సిపల్ అన్బుచెళియన్, ఆర్‌ఎంకే సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ సురేష్‌కుమార్, డీన్ శివజ్ఞానప్రభు పాల్గొన్నారు.