
చిన్న, పెద్ద చూడను!
తమిళసినిమా: చిత్రాల విషయంలో తాను చిన్న,పెద్ద తారతమ్యం చూపనని సోనియాఅగర్వాల్ అన్నారు. ఈమె ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఇందులో సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రను పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా, అలోకియా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. గురువారం చైన్నెలోని ప్రసాద్‌బాబు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. జడ్జి పాత్రను సోనియా అగర్వాల్ పోషించారని, చిన్న వివాదాస్పద పాత్రను అలోకియా నటించారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్‌ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు రూ.కోటి వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.