
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
వేలూరు: ఆరోగ్యమైన సమాజం కోసం బాలింతలు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని డీఆర్‌ఓ మాలతి సూచించారు. జాతీయ పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని అంగన్‌వాడీ, పౌష్టికాహార కార్మికులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఆర్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ టౌన్ హాలుకు చేరుకుంది. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు. వీటిపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఉపాధి కూలీలతోపాటు బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం జన్మించే చిన్నారులను మేధాశక్తి వంతులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తల్లులు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. అదేవిదంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, పౌష్టికాహార కార్మికులు గర్భణులకు పౌష్టికాహారం తీసుకోవడంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, కార్పొరేషన్ రెండవ జోన్ చైర్మన్ నరేంద్రన్, తహసీల్దార్ వడివేలు, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి శాంతి ప్రియదర్శిని పాల్గొన్నారు.