
డీఎంకేకు మద్దతు ఇస్తూనే ఉండాలి
– మహిళా లోకానికి ఉదయనిధి పిలుపు
సాక్షి, చైన్నె: డీఎంకేకు ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉండాలని మహిళలకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన దిండుగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. తండ్రి, సీఎం స్టాలిన్ బాణిలో ఆయన ఉదయాన్నే దిండుగల్‌లో వాకింగ్‌కు వెళ్తూ అందర్నీ పలకరించారు. ఆయనతో జనం సెల్ఫీలు దిగారు. అధికారులతో ప్రభుత్వ పథకాలపై సమీక్షించిన అనంతరం సాయంత్రం వేడచందూర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలిరావడంతో వారికి సంక్షేమ సహాయకాలను అందజేశారు. రూ.28.14 కోట్ల విలువైన 39 పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.49.59 కోట్ల విలువైన 23 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 5,478 మంది లబ్ధిదారులకు రూ.61.45 కోట్ల విలువగల ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సహాయకాలను అందజేశారు. మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. వారు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. ఇచ్చిన హామీలను సీఎం స్టాలిన్ నెరవేర్చారని పేర్కొంటూ, మహిళల కోసం అమలు అవుతున్న పథకాలను ఈసందర్భంగా తన ప్రసంగంలో ఉదయనిధి గుర్తు చేశారు. మహిళాభ్యున్నతి దిశగా ముందుకెళ్తున్న ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎప్పటిలాగే మద్దతు ఇస్తూనే ఉండాలని పిలుపు నిచ్చారు.