
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, చైన్నె: వర్షాల సీజన్ నేపథ్యంలో చైన్నెలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన ముగించాలని అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు.టీటీకే రోడ్డు నుంచి వీనస్ కాలనీ వరకు నిర్మాణంలో ఉన్న వర్షపు నీటి పారుదల కాలువ పనులను ఆదివారం సీఎం పరిశీలించారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాల సీజన్ మరి కొద్ది రోజులలో ప్రారంభం కానుంది. ఇందుకు శుభ సూచకంగా దక్షిణ తమిళనాడు, డెల్టా, ఉత్తర తమిళనాడులలో అనేక ప్రాంతాలలో వర్షాలు మొదలయ్యాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావం అత్యధికంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ తమిళనాడుపై సాధారణంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో శని, ఆదివారాలలో చైన్నె, శివారు జిల్లాలో తెరపించి తెరిపించి మోస్తరుగా వర్షం పడింది. కాసేపు భానుడు, మరి కాసేపు వర్షం అన్నట్టుగా వాతావరణం మారింది. అలాగే కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని, విరుదునగర్, దిండుగల్, మదురై తదితర జిల్లాలో అక్కడక్కడమోస్తారుగా వర్షం పడింది. కృష్ణగిరి, సేలంలలోనూ వర్షాలుపడ్డాయి. కృష్ణగిరిలో అత్యధికంగా 12 సెం.మీ వర్షంపడగా, సేలం ఎడపాడిలో 10 సెం.మీ వర్షం పడింది. ఇక, సోమవారం ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. ఈనెల తొమ్మిదో తేది వరకు ఉపరితల ఆవర్తనం రూపంలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది.
సీఎం తనిఖీలు
చైన్నెలోనూ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు విస్తృతం అయ్యాయి. ఈ పరిస్థితులలో ఆదివారం ఉదయాన్నే టీటీకే రోడ్డు – వీనస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న వర్షపు నీటి కాలువల పనులను సీఎం స్టాలిన్ పరిశీలించారు. తేనాంపేట జోన్ పరిధిలో జరుగుతున్న ఈ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీనివాసన్ వీధి, వరదరాజపురం మెయిన్ రోడ్, కస్తూరి ఎస్టేట్ వీధి, శేషాద్రి వీధి, మురేష్ గేట్ రోడ్డు వీధులు వర్షాకాలంలో ఈ సారి నీళ్లు అన్నది నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడి నుంచి నీటిని తరలించేందుకు వీలుగా జయమ్మల్ రోడ్, ఇలంగో రోడ్ క్రాస్ స్ట్రీట్, పోయేస్ రోడ్డు, వెంకటరత్నం రోడ్డు, రాజకృష్ణ రోడ్డు, వరదరాజపురం మెయిన్ రోడ్డు , టీటీవీకే రోడ్డును అనుసంధానించే విధంగా రూ. 8.21 కోట్లతో జరుగుతున్న పనులను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు. రుతు పవనాల సీజన్‌లో వర్షాల రూపంలో, వరదల రూపంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలుగ కూడదని హెచ్చరించారు. ఎల్డమ్స్ రోడ్, సి.బి. రామసామి రోడ్, లజ్ చర్చి రోడ్, సీఐటీ కాలనీ మార్గాలలో పూర్తయిన పనులను కూడా ఈసందర్భంగా సీఎం పరిశీలించారు. ఈ అధ్యయనం సమయంలో సీఎంతో పాటూ ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్, ఎమ్మెల్యే ఎలిళన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చిత్త అరసు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్ తదితరులు పాల్గొన్నారు. కాగా చైన్నెలో వర్షపు నీటి తరలింపునకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించిన మేయర్ ప్రియ మాట్లాడుతూ 20 సెం.మీ వర్షం పడ్డా, నీరు అన్నది నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు చేపట్టి ఉన్నామని వివరించారు.