
చైన్నెలో వల్లలార్ అంతర్జాతీయ సదస్సు
– మంత్రి పి.కె. శేఖర్ బాబు వెల్లడి
కొరుక్కుపేట: 10 వేల మంది భక్తుల భాగస్వామ్యంతో చైన్నెలో వల్లలార్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు హిందూ ధర్మదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు అన్నారు. వివరాలు.. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం నేతృత్వంలో కడలూరు జిల్లా వడలూరులో వల్లలార్ దేవ నిలయంలో 203వ వార్షికోత్సవంలో మంత్రి పీకే శేఖర్‌బాబు పాల్గొని ధార్మిక జెండాను ఎగురవేసి భక్తులకు అన్నదానం చేశారు. వల్లలార్ ఇంటర్నేషనల్ సెంటర్‌లోని శ్రీబిశ్రీ సెక్షనన్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా వారు పరిశీలించారు. తరువాత మంత్రి పి.కె. శేఖర్‌బాబు చైన్నెలో వల్లలార్ నివసించిన ప్రాంతానికి వల్లలార్ నగర్ అని పేరు పెట్టారు. అలాగే ఆ ప్రాంతంలోని బస్టాప్‌కు కూడా ఆయన పేరు పెట్టారు. చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సీఎం స్టాలిన్ రూ. 6 కోట్ల వ్యయంతో ప్రయాణికుల అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చే వ్యవస్థను అభివృద్ధి చేసే పనిని ప్రారంభించారు. వచ్చే నవంబర్, డిసెంబర్‌లో చైన్నెలో 10,000 మందితో ముఖ్యంగా 2,000 మందికి పైగా మహిళలు పాల్గొనే వల్లలార్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించామన్నారు . ఆ సమావేశంలో వల్లలార్ వైభవాన్ని పెంచే సన్మార్గులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రత్యేక గుర్తింపు ఇస్తామని తెలిపారు. వల్లార్‌పై ఓ పుస్తకం కూడా ప్రచురించినట్లు పేర్కొన్నారు.
చిన్నమ్మకు బెదిరింపు
సాక్షి,చైన్నె : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి మరీ బెదిరించి వెళ్లడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె తరపున ప్రతినిధి తేనాంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. పోయస్ గార్డెన్‌లో శశికళ నివాసం ఉన్న విషయం తెలిసిందే. తరచూ ఓ వ్యక్తి ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తున్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ పరిస్థితులలో తానో పోలీసు అధికారి అంటూ ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మరీ శశికళను బెదిరించి వెళ్లడాన్ని తీవ్రంగా ఆమె తరపు వారు పరిగణించారు. ఆమెను బెదిరించిన వ్యక్తికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరాలలోనమోదైన దృశ్యాలతో తేనాంపేట పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా నందనంలో నివాసం ఉంటున్న నటి స్వర్ణమాల్యకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎన్నికల కసరత్తు
ప్రారంభించిన కాంగ్రెస్
● ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీ
● సెల్వ పెరుందగై ప్రకటన
కొరుక్కుపేట: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌లో పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. ముఖ్యంగా ఓట్ల రిగ్గింగ్‌కు వ్యతిరేకంగా సంతకాల ప్రచారాన్ని గ్రామాలకు తీసుకెళ్లాలని వారు యోచిస్తున్నారు. కోటి సంతకాలను సేకరించి ఢిల్లీ నాయకత్వానికి పంపాలని వారు నిర్ణయించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పనిని ముమ్మరం చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుందగై ఐదుగురు సభ్యుల సమన్వయ కమిటీని నియమించారని, సీనియర్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కె. విజయన్, జ్యోతి, కీళనూర్ రాజేంద్రన్, డి.ఎన్. అశోకన్, కె.ఎస్. కుమార్ ఈ బృందంలో భాగం అని నేతలు పేర్కొంటున్నారు. కాగా సంతకాల డ్రైవ్‌ను తీవ్రతరం చేయడం, పార్టీ సమావేశాలు, రాబోయే ఎన్నికలకు సంబంధించిన పనులను ఈ బృందం సమన్వయం చేస్తుందని ప్రకటించారు. పార్టీ నాయకత్వం ప్రకటించిన అన్ని కార్యాచరణ ప్రణాళికలను నిర్ణీత సమయ వ్యవధిలో పూర్తి చేయడానికి ఈ బృందం ప్రణాళికతో పనిచేస్తుందని సెల్వ పెరుందగై వెల్లడించారు.
కంటైనర్ –బస్సు ఢీ
– 23 మందికి గాయాలు
అన్నానగర్: ఆర్కాడ్ సమీపంలో లగ్జరీ బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. చైన్నె నుంచి బెంగళూరుకు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ బస్సు రాణిపేట జిల్లాలోని ఆర్కాట్ సమీపంలో శనివారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి పై ప్రయాణిస్తుండగా, లగ్జరీ బస్సు డ్రైవర్ అనుకోకుండా నిద్రమత్తులోకి జారుకుని కాంచీపురం నుంచి కృష్ణగిరి జిల్లాకు గృహ నిర్మాణం కోసం కాంక్రీట్, సిమెంట్ దూలాలను తీసుకెళ్తున్న కంటైనర్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులోని 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ హరీష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే ఆర్కాట్ నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు ఆర్కాట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.