
12 నుంచి నైనార్ రాష్ట్ర పర్యటన
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 12 నుంచి ఆయన పర్యటన జరగనుంది. మదురైలో జరిగే సభతో ఈ పర్యటను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించానున్నారు. వివరాలు.. తమిళనాడులో పాగా వేయాలన్న లక్ష్యంతో వ్యూహాలకు బీజేపీ పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలనుఎదుర్కొనేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు తమ వంతుగా బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్యయాత్ర రూపంలో తన బలాన్ని చాటుకుంటూ వస్తున్నారు.ఈ పరిస్థితులో బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఆయన ప్రపథమంగా రాష్ట్రపర్యటన చేపట్టనున్నారు.
ప్రచార సభల రూపంలోనే..
మదురైలో ఈనెల 12వ తేదిన జరిగే సభతో రాష్ట్ర పర్యటనకు నైనార్ శ్రీకారంచుట్టనున్నారు. ఈ పర్యటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నట్టు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఈ పర్యటన జయప్రదం విషయంగా ఇప్పటికే పలు మార్లు జిల్లాల కార్యదర్శులతో నైనార్ సమావేశాలు నిర్వహించారు. 12న మదురై, 13న శివగంగై,14న చెంగల్పట్టు, 15 ఉత్తర చైన్నె, 16న సెంట్రల్‌చైన్నె, 24వతేదీన పెరంబలూరు, అరియలూరు, 25న తంజావూరు, 28న దిండుగల్, 29 నామక్కల్‌లలో పర్యటించనున్నారు. నవంబర్ నెలాఖరు వరకు తొలివిడత పర్యటన, డిసెంబరులో రెండు, మూడో విడత పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే ప్రచార సభల రూపంలోనే యాత్ర సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ షోలోకు అనుమతిని హైకోర్టు ఇప్పటికే నిషేధం విధించింది. అలాగే రహదారులు,జాతీయ రహదారులలో సభలకు సైతం అనుమతి రద్దు చేసి ఉండటంతో ఆయా ప్రాంతాలో మైదానాలను వేదికగా ఎంపిక చేసుకునే దిశగా బీజేపీ వర్గాలు ముందుకెళ్తున్నాయి.