– టీటీవీ స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: పళణి స్వామి పతనమే లక్ష్యంగా 2026 ఎన్నికలలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పనితీరు ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. కరూర్ పెను విషాద ఘటనలో బాధితులకు అండగా నిలబడడంలో సీఎం స్టాలిన్ పనితీరు అభినందనీయమని కొనియాడారు. శనివారం సాయంత్రం చైన్నెలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో చేరబోమని పేర్కొంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై విరుచుకు పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అన్నాడీఎంకే వర్గాలు ఎదురు దాడిలో నిమగ్నమయ్యాయి. అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్‌బీ ఉదయకుమార్ స్పందిస్తూ, తనను నమ్ముకు వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా అనాథలు చేసిన ఘనత దినకరన్‌కే దక్కుతుందని విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకేను ఓడించడమే లక్ష్యంగా ఆయన పనితీరు ఉంటుందని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని, ఒక్కసారి ఆయన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, వ్యక్తిగత దాడులను మానుకోవాలని మండిపడ్డారు. ఈ విషయంగా టీటీవీ దినకరన్‌ను ఆదివారం మీడియా ప్రశ్నించగా, ఆర్‌బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన లక్ష్యం పళణి స్వామి పతనం అని స్పష్టం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు తూట్లు పొడి చేశారని, వారు రూపకల్పన చేసిన నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారని, సిద్ధాంతాలను తాకట్టు పెట్టేశారని, ఇప్పుడు ఉన్నది అక్కడ అన్నాడీఎంకే కాదని, ఎడపాడి డీఎంకే అని వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎడపాడి పళణిస్వామి పతనమే లక్ష్యంగా 2026 ఎన్నికలలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పనితీరు ఉంటుందన్నారు. కరూర్ పెను విషాదం వ్యవహారంలో సీఎం స్టాలిన్ పనితీరును అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయంగా ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా బాధితులకు అండగా నిలబడ్డారని కొనియాడారు. అయితే, ఈ ఘటనను అడ్డం పెట్టుకుని తమిళగ వెట్రి కళగంనేత విజయ్‌ను దారికి తెచ్చుకుని కూటమిలో చేర్చుకునేందుకు పళణి స్వామి కుస్తీలు పడుతుండడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు.