
నిత్యం పోరాటాలే..
● గవర్నర్‌పై సీఎం ఫైర్
సాక్షి, చైన్నె : మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నిత్యం తమిళనాడు పోరాడుతూనే ఉంటుందని సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవిని టార్గెట్ చేసి ఆదివారం ఆయన ఎక్స్ పేజీలో విరుచుకుపడ్డారు. చైన్నెలో జరిగిన వళ్లలార్ జయంతి వేడుకలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ తమిళనాడు ఎవరితో పోరాటంచేస్తున్నదో అంటూ పరోక్షంగా సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేశారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో విరుచుకు పడ్డారు. తమిళనాడు ఎవరితో పోరాడుతుంది? అని గవర్నర్ అడిగారంటూ గుర్తు చేశారు. హిందీని అంగీకరిస్తేనే విద్యా నిధులు అందిస్తామని ఆయన చెప్పారే అని పేర్కొంటూ, ఇలాంటి అహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించే విద్యా సంస్థలపై మూఢనమ్మకాలు రుద్దే విధంగా, తప్పుడు కథలు చెప్పడం ద్వారా, యువతరాన్ని వంద సంవత్సరాలు వెనక్కి లాక్కెళ్తున్న ఇలాంటి కుట్రకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మతతత్వాన్ని నెత్తి వరకు ఎక్కించుకుని పైశాచికత్వంతో మోసుకెళ్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాలను అణిచేసే శక్తులతో..
ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అణచివేసే శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, ప్రతిసారీ గవర్నర్ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి హక్కుల సాధనకు పోరాడుతున్నాం అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడులోకి పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకుంటున్న కుట్రదారులతో పోరాడుతున్నాం, ప్రజల ఐక్యతను నాశనం చేస్తున్న వారితో పోరాడుతున్నాం, ఆధిపత్య మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని నాశనం చేసినప్పటికీ, తమిళనాడు మాత్రం 11.19 శాతం వృద్ధిని సాధించిందని వివరించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమిళనాడు తన మనసు మార్చుకోదని, ప్రజలలో గందరగోళం సృష్టించడానికి మాత్రమే పనిచేసే ఇలాంటి గవర్నర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, అంటూ, చివరికి తమిళనాడుకే గెలుపు అన్నది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.