
శనివారపు చుట్టాన్ని కాదండోయ్..!
వారంలో 4,5 రోజులు జనంలో ఉన్నా డిప్యూటీ సీఎం ఉదయ నిధి వ్యాఖ్య 819 మంది క్రీడాకారులకు రూ. 21.40 కోట్లు పంపిణీ నలుగురికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు
తాను నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటా.. వారంలో నాలుగైదు రోజులు ప్రజల్లోనే ఉంటాను. తాను శనివారం మాత్రం కనిపించే చుట్టాన్ని కాదండోయ్.. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.
సాక్షి, చైన్నె : తాను శనివారపు చుట్టాన్ని మాత్రం కాదండోయ్ అని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సందించారు. వారంలో నాలుగైదు రోజులు తాను జనంలో ఉన్నానని చెప్పారు. ఇక క్రీడాపరంగా రాణించిన 819 మంది క్రీడాకారులకు రూ.21.40 కోట్లు విలువగల ప్రోత్సాహకాలను ఆయన అందజేశారు. అంతర్జాతీయ, ఆసియా, జాతీయ స్థాయిలో జరిగిన వివిధ క్రీడాపోటీల్లో పతకాలను సాధించిన 819 మంది క్రీడాకారులను ప్రోత్సహించేలా కలైవానర్ అరంగం వేదికగా శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు రాష్ట్ర క్రీడల శాఖ నేతృత్వంలో రూ.21.40 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే ఎలైట్ అథ్లెట్లకు ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం కింద ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచుతూ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఎలైట్ లబ్ధిదారుల సంఖ్యను 12 నుంచి 50కి పెంచారు. మ రిన్ని అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలుచుకోవడం కోసం అథ్లెట్లకు అందించే ఆర్థిక సహాయం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచారు. ఈ సంఖ్యను 125కు పెంచారు. తాజా వేడుకలో స్కేటింగ్ పోటీలో 2 బంగారు పతకాలు , ఒక కాంస్య పతకం పాధించిన తమిళనాడు విజేత స్కేటర్ ఆనంద్ కుమార్‌కు రూ.1.80 కోట్ల చెక్కును డిప్యూటీ సీఎం ఉదయ నిధి అందజేశారు. బాక్సింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, బీచ్ వాలీబాల్, అథ్లెటిక్స్, స్క్వాష్, సర్ఫింగ్, సెయిలింగ్, సైక్లింగ్, ఈత, టెన్నిస్, రోయింగ్, చెస్, వాలీబాల్, టెన్నిస్, ఫెన్సింగ్, టైక్వాండో, జిమ్నాస్టిక్స్, జూడో, బ్యాడ్మింటన్, ఐస్ స్కేటింగ్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయంగా పతకాలను సాధించిన 819 మందికి చెక్కులను అందజేశారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీలో పనిచేస్తూ సర్వీసులో మరణించిన నలుగురు ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఈ వేడుకలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్ర, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్యకార్యదర్శి జే మేఘనాథరెడ్డి, డిప్యూటీ చైర్మన్ అశోక్ సికామణి, జిల్లా రెవెన్యూ అధికారి వి.మణిగండన్, జనరల్ మేనేజర్ సుజాత, స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్ ఆనంద్ కుమార్, చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి, ఇతర ప్రభుత్వ అధికారులు, కోచ్‌లు, అథ్లెట్లు పాల్గొన్నారు.
ఓర్పు అవశ్యం
తమిళనాడు నుంచి నిరంతరం అథ్లెట్ల సంఖ్య పెరుగుతోందని, క్రీడాభివృద్ధి రెట్టింపు అవుతోందని, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన ఆనందకుమార్, వైశాలి ఇక్కడే ఉన్నారని ప్రస్తావించారు. ఈ పతక విజేతలు రానున్న కాలంలోని క్రీడాకారులకు రోల్ మోడల్స్ అని, ప్రతి క్రీడాకారుడికి మద్దతుగా ప్రభుత్వం నిరంతరం ఉంటుందని వ్యాఖ్యానించారు.
పట్టుదల, కృషి, సాధనతో పాటుగా విజయం కోసం ఓర్పుగా ఎదురు చూడాల్సిన అవశ్యం ఉందని సూచించారు. విజయం సాధించడానికి ఓర్పు చాలా చాలా ముఖ్యమని, దీన్ని ప్రతి క్రీడాకారుడు మదిలో పదిలం చేసుకోవాలని సూచించారు. తాను నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటానని, వారంలో నాలుగైదు రోజులు ప్రజల్లోనే ఉంటానని వ్యాఖ్యానించారు. అయితే, తాను శనివారం మాత్రం కనిపించే చుట్టాన్ని కాదండోయ్, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని అంటూ పరోక్షంగా విజయ్‌ను ఎద్దేవా చేసే రీతిలో వ్యాఖ్యలు చేశారు.
వైశాలి, ఆనంద్‌కుమార్‌కు చెక్కులు అందజేస్తున్న ఉదయ నిధి
నియామక ఉత్తర్వులను అందజేస్తున్న ఉదయ నిధి
ఓర్పుతో ముందడుగు
డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ నెహ్రు ఇండర్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన విద్యలో ముందంజ తమిళనాడు కార్యక్రమాన్ని గుర్తు చేశారు. విద్య అంటే కేవలం పాఠశాల విద్య, ఉన్నత విద్య మాత్ర మే కాదని, శారీరక విద్య కూడా చాలా ముఖ్యమైందని పేర్కొంటూ క్రీడల గురించి వివరించారు. అద్భుత ప్రతిభ కలిగిన అథ్లెట్టు ఇక్కడ ఉన్నారని, క్రీడల్లో సాధించిన పతకాలు సాధించిన క్రీడాకారుల్లో కొందరు ఈ వేదికపై ఉన్నారన్నారు. క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగ అవకాశాల కల్పన విస్తృతం చేశామని, ఇందులో దేశంలోనే తొలి రాష్ట్రంగా తమిళనాడు ఉందని వ్యాఖ్యానించారు.
నాలుగేళ్లలో అథ్లెట్లకు
రూ.150 కోట్ల ప్రోత్సహకం
ఆటగాళ్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు, సహాయం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు.ఈ నాలుగు సంవత్సరాలలో సుమారు 4,510 మంది అథ్లెట్లకు రూ. 150 కోట్ల ప్రోత్సహాన్ని అందించామని చెప్పారు. ఈ ప్రోత్సహకంతో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నారన్నారు. క్రీడాకారులకు ఏటా ప్రోత్సహకం పెంచాలని, ప్రయోజనం మరింత చేకూర్చాలని, మరెందర్నో క్రీడాకారులకు తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా గత సంవత్సరం 100 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించామని ప్రకటించారు. ప్రోత్సహించేందుకు తాము సిద్ధం అని, విజయాలతో తిరిగి రావడం ప్రతి క్రీడాకారుడి ప్రతిభ, నైపుణ్యం మీద ఉందన్నారు. రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగం తప్పని సరిగా దరి చేరుతుందన్నారు.

శనివారపు చుట్టాన్ని కాదండోయ్..!

శనివారపు చుట్టాన్ని కాదండోయ్..!

శనివారపు చుట్టాన్ని కాదండోయ్..!