
ఢిల్లీలో డీజీపీ ఎంపిక కసరత్తు
– యూపీఎస్సీ చైర్మన్ కమిటీతో భేటీ
సాక్షి, చైన్నె : రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ పదవి కసరత్తులు ఢిల్లీలో మొదలయ్యాయి. యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోం శాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్‌లు ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ శంకర్ జివ్వాల్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం వివాదానికి దారి తీసింది. దీంతో తాత్కాలిక డీజీపీగా వెంకటరామన్ వ్యవహరిస్తూ వస్తున్నారు. డీజీపీ ఎంపికలో సీనియారిటీ పాటించడం లేదని, నిబంధనలు తుంగలో తొక్కుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. నిబంధనలకు అనుగుణంగా యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎంపిక కసరత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎంపిక కసరత్తులు మొదలయ్యాయి.
ఢిల్లీలో భేటీ
ఢిల్లీలోని యూపీఎస్సీ కమిషన్ ప్రధాన కార్యాలయంలో పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక కసరత్తులు మొదలయ్యాయి. శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ సమావేశమైంది. ఇందులో తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోంశాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్, తాత్కాలిక డీజీపీ వెంకటరామన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాబితాను సమర్పించారు. రాష్ట్రంలో డీజీపీ హోదాతో ఉన్న సీమా అగర్వాల్, రాజీవ్‌కుమార్, సందీప్ రాయ్, వన్నియ పెరుమాల్‌తో పాటుగా ఆరుగురి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ జాబితాలో అధికారుల గురించి సమగ్ర పరిశీలన ఈ సమావేశంలో జరిగింది. ఇందులో ముగ్గురి పేర్లను తమిళనాడు ప్రభుత్వానికి యూపీఎస్సీ కమిటీ సిఫారసు చేయనున్నది. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా నియమించనున్నారు. దీంతో ఈ పదవి ఎవరిని వరించనున్నదో అన్న ఎదురు చూపులో ఐపీఎస్ వర్గాలు ఉన్నాయి.