
26 కొత్త పుస్తకాల ఆవిష్కరణ
–146 గ్రంఽథాలయాల ప్రారంభం
సాక్షి, చైన్నె : తమిళనాడు పాఠ్యపుస్తకాలు, విద్యా సేవల కార్పొరేషన్ తరఫున తీర్చిదిద్దిన 26 కొత్త పుస్తకాలను సీఎం స్టాలిన్ శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. పుస్తక ప్రియులు, పాఠకుల కోసం నిర్మించిన 146 గ్రంథాలయాల భవనాలను ప్రారంభించారు. కళ్లకురిచ్చి జిల్లా కేంద్ర గ్రంథాలయం పనులకు శంకు స్థాపన చేశారు. సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. పుస్తకాలు, శతాబ్దాల నాటి వ్యక్తులు, తమిళ పండితుల అనువాద ప్రాజెక్ట్, యువ సాహిత్య ప్రాజెక్ట్, క్లాసికల్ పుస్తకాలు, అరుదైన పుస్తకాలు విద్యాశాఖ పరిధిలోని పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం నేతృత్వంలో తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. తాజాగా శ్ఙ్రీతమిళనాడులో గాంధీ, తమిళ నాయకుడు పెరియార్‌శ్రీ అనే పుస్తకం, పల్లవ చరిత్ర, సింధు లోయ నాగరికత పుస్తకాలు, వైద్య పరిశోధన పద్ధతులు, థీసిస్ తదితర చరిత్ర, పురాతన, క్లాసికల్ అంశాలతో 26 కొత్తపుస్తకాలను ముద్రించారు. అలాగే గ్రామీణ సమాజంలో విద్య, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, మేధస్సును పెంచే పుస్తకాలతో 4,682 లైబ్రరీలు ఉన్నాయి. 2024 బడ్జెట్‌లో కేటాయించిన మేరకు గ్రంథాలయాల అభివృద్ధి, మెరుగైన వసతుల కల్పన దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా రూ. 39 కోట్లతో 146 గ్రంథాలయాలను నిర్మించగా, వాటిని పాఠకులకు అంకితం చేస్తూ వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. కళ్లకురిచ్చిలో కొత్త జిల్లా కేంద్ర గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారు. దీనిని రూ.4 కోట్లతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అన్బిల్ మహేశ్, కార్యదర్శి పి చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ‘విద్యలో ఉత్తమ తమిళనాడు’ వేడుకలో పలువురు విద్యార్థులు తమ కష్టాలను విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఇందులో నాన్ మొదల్వన్ పథకం లబ్ధిదారుడైన యువకుడి కలను సాకారం చేస్తూ, అతడికి కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వడానికి సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాలేజ్ రోడ్డుకు జయశంకర్ పేరు
చైన్నె నుంగబాక్కం కాలేజ్ రోడ్డుకు సినీ నటుడు, తెరపై తమిళ జేమ్స్ బాండ్‌గా పేరు గడించిన జయశంకర్ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. అలాగే, మందవేలి పాక్కం ఐదో క్రాస్ రోడ్డుకు నాటక కళాకారుడు ఎస్వీ వెంకటరామన్ పేరును ఏర్పాటు చేసి, బోర్డును ఆవిష్కరించారు. ఇక, టీ నగర్‌లో బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న వంతెనకు అన్బళగన్ పేరు పెట్టేందుకు నిర్ణయించారు. ఆదివారం ఈ వంతెనను ప్రారంభించనున్నారు.