
ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్
విజయ్
సాక్షి, చైన్నె : ఎట్టకేలకు చివరి క్షణంలో పోలీసులు అనుమతి ఇవ్వడంతో నామక్కల్, కరూర్ పర్యటనలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సిద్ధమయ్యారు. శనివారం ఈ రెండు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కాగా, విజయ్ పార్టీ జెండా వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. మీట్ ది పీపుల్ నినాదంతో విజయ్ చేపట్టిన ప్రచార యాత్ర గురించి తెలిసిందే. ప్రతి శనివారం ఆయన రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. శనివారం నామక్కల్, కరూర్‌లలో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే, విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం వివాదానికి దారి తీసింది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ బయలు దేరింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పర్యటన ఖరారు చేశారు. ఉదయం నామక్కల్‌లో పర్యటించనున్నారు. నామక్కల్ – సేలం రహదారిలోని కేఎస్ రోడ్డులో విజయ్ పర్యటన జరగనన్నది. ఇందుకు సంబంధించి ఆగమేఘాలపై ఏర్పాట్లను తమిళగ వెట్రి కళగం వర్గాలు చేశాయి. అలాగే, కరూర్‌లో వేలుస్వామి పురంలో ప్రచార బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ కూడా ఆగమేఘాలపై ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పరిశీలించారు. విజయ్‌కు బ్రహ్మరథం పట్టేలా తమిళగ వెట్రికళగం వర్గాలు, అభిమానులు ఆహ్వానానికి సిద్ధమయ్యారు. కాగా, విజయ్ పర్యటనపై మరో మారు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ విమర్శలు గుప్పించారు. సిద్ధాంతం అంటూ లేదు, మార్పునకు అంశాలు లేవు అంటూ డీఎంకే, అన్నాడీఎంకే అనే గ్రహాల్లో మరో శని గ్రహం అంటూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలోని అన్నా, అన్నాడీఎంకేలోని ఎంజీఆర్‌ను ఇరు వైపులో విజయ్ పెట్టుకోవడం చూస్తే, ఆ రెండు పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగానే విజయ్ పయనిస్తున్నారన్నది స్పష్టమవుతోందన్నారు.
మళ్లీ కోర్టుకు జెండా
విజయ్ పార్టీ జెండా వివాదం సద్దుమణిగేలా లేదు. ఇప్పటికే ఈ జెండా విషయంగా, ఈ జెండాలోని ఏనుగుల విషయంగా వివాదాలు కోర్టుకు వెళ్లి వచ్చాయి. తమ సేవా సంఘం జెండాను పోలి ఉన్నట్టు తొండై మండలం ధర్మపాలన సభ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ తిరస్కరించింది. దీంతో ఈ సభ తరపున అప్పీలు పిటిషన్ శుక్రవారం దాఖలైంది. దీనిని పరిశీలించిన న్యాయ మూర్తి ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని విజయ్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.