
అసెంబ్లీకి చేరిన పీఎంకే పంచాయితీ
సాక్షి, చైన్నె: పీఎంకేలో వివాదం గురువారం అసెంబ్లీకి చేరింది. అన్బుమణి తరపున స్పీకర్ అప్పావుకు ఇచ్చిన లేఖ చర్చకు దారి తీసింది. పార్టీ శాసన సభా పక్ష నేతగా ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేషన్‌ను నియమించినట్టు అందులో ప్రకటించడం మరింత వివాదానికి దారి తీసింది. వివరాలు.. 2021 అసెంబ్లీ ఎన్నికలలో పీఎంకే తరపున ఐదుగురు అసెంబ్లీకి ఎన్నికై న విషయం తెలిసిందే. సీనియర్ నేత, ఎమ్మెల్యే జీకే మణి అప్పటి నుంచి పార్టీ శాసన సభా పక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీఎంకేలో వివాదంతో శాసన సభా పక్ష వ్యవహారం సైతం తాజాగా రచ్చకెక్కింది. పార్టీలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న అధికార సమరంలో నలిగిపోతూ వస్తున్న నేతలకు తోడుగా తాజాగా ఎమ్మెల్యేలు రెండుగా విడిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు వెన్నంటి, పార్టీ గౌరవ అధ్యక్షుడిగా జీకేమణి ఉంటూ వస్తున్నారు. అలాగే, ఎమ్మెల్యేల అరుల్ వ్యవస్థాపకుడికి అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు ఇంటా, బయట, కోర్టు అంటూ సాగుతూ వచ్చిన రాందాసు, అన్బుమణి మధ్య అధికార సమరం గురువారం అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీ స్పీకర్ అప్పావు కోర్టులోకి వ్యవహారం చేరింది.
శాసన సభా పక్షంలో మార్పు..
తన వెన్నంటి నడిచిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో పెద్దపీట వేయడానికి అన్బుమణి నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం తన అధ్యక్ష పదవికి అంగీకారం తెలిపిన నేపథ్యంలో తన అధికారాలను ఉపయోగించి శాసనసభా పక్షంలో మార్పునకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శాసన సభా పక్ష నేతగా ఉన్న జికేమణిని తప్పించారు. ఆయన స్థానంలో ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేషన్‌ను పీఎంకే శాసన సభా పక్ష నేతగా, మరో ఎమ్మెల్యే సదాశివంను ఉపనేతగా, శివకుమార్‌ను విప్‌గా నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈమార్పును అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని స్పీకర్ అప్పావుకు అన్బుమణి తరపు న్యాయవాది బాలు వినతి పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ ద్వారా పంపించారు. ఈ వినతి పత్రాన్ని స్వయంగా శ్రీనివాసన్‌కు బాలు సమర్పించారు. ఈ విషయంగా బాలు మీడియాతో మాట్లాడుతూ అన్బుమణి అధ్యక్ష పదవి 2026 ఆగస్టు వరకు పొడిగించబడినట్టు, ఇందుకు ఎన్నికల కమిషన్ సైతం ఆమోదించిందన్నారు. అందుకే పార్టీ శాసన సభాపక్షంలో మార్పు చేసినట్టు వివరించారు. పార్టీ ఎమ్మెల్యే అరుల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగించినట్టు ప్రకటించారు.
నాన్చుడేనా..
పీఎంకే శాసన సభా పక్షం మార్పు వ్యవహారంలో స్పీకర్ అప్పావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. అక్టోబరు 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యవహారంలో నాన్చుడు ధోరణి అనుసరించే అవకాశాలు ఎక్కువగా చెప్పవచ్చు. ఇందుకు కారణం అన్నాడీఎంకేలో వివాదాల నేపథ్యంలో ఆ పార్టీ శాసన సభా పక్ష ఉప నేతగా పన్నీరు సెల్వంను తప్పించాలని విన్నవించుకున్నా కొంత కాలం ఖాతరు చేయక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పీఎంకేకు 25 సంవత్సరాలు అధ్యక్షుడిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, తాజాగా శాసన సభా పక్ష నేతగా ఉన్న జికే మణిని తప్పించడం పీఎంకేలోని ఇరు శిబిరాలలో తీవ్ర చర్చబయలు దేరింది. ఈ విషయంగా బాలును ప్రశ్నించగా, ఆయన్ని పార్టీ నుంచి తొలగించ లేదని, శాసన సభా పక్షం పదవి నుంచి విడిపించినట్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో రాందాసుకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన మద్దతు దారులు డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

అసెంబ్లీకి చేరిన పీఎంకే పంచాయితీ