
చైన్నెలో రైతు ఉత్సవం
సాక్షి, చైన్నె: చైన్నె నందంబాక్కం వర్తక కేంద్రం వేదిగా రెండురోజుల పాటూ రైతు ఉత్సవం పేరిట వ్యవసాయ ప్రదర్శనకు చర్యలు తీసుకున్నామని ఆ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీరుసెల్వం తెలిపారు. ఈనెల 27,28 తేదీలలో జరిగే ఈ ఉత్సవానికి రైతులు, రైతు ఉత్పత్తి దారులు, పరిశ్రమలు, వ్యవసాయ పరిశోధకలు, విద్యార్థులు తరలి రానున్నట్టు వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అధిక శాతం మంది ప్రజల జీవనాధారమైన వ్యవసాయం, పరిశ్రమ, రైతు సంక్షేమం దిశగా ఇప్పటి వరకు ఐదు సార్లు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేశామని గురువారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి వివరించారు. 2025–26లో బడ్జెట్‌లో వివిధ కొత్త కార్యక్రమాలు అమలు చేయబడతాయని ప్రకటించామన్నారు. ఆ మేరకు జూన్‌లో ఈరోడ్ జిల్లా పెరుంతురైలో రైతు ఉత్సవం మూడు రోజులు జరిగిందని గుర్తు చేశారు. లక్షలాది మందికి ఉపయోగకరంగా ఈ ఉత్సవం మారడంతో ప్రస్తుతం చైన్నెలో రెండురోజుల కార్యక్రమానికి చర్యలు తీసుకున్నామన్నారు. వ్యవసాయంలో సాంకేతికతలను స్వీకరించడం, పెరుగుతున్న అవకాశాలతో పాటూ సదస్సులు, చర్చలు, తయారీ దారులు,రైతులు, వర్తలకుతో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నా మన్నారు. ఈ పండుగను విజయవంతం చేద్దామన్నారు. శనివారం ఈ ఉత్సవాలను సీఎం స్టాలిన్ ప్రారంభిస్తారన్నారు. రైతులకు సంక్షేమ పథకాలను అందించనున్నారన్నారు. చైన్నె సమీపంలోని 14 జిల్లాల రైతులు, వారి ఉత్పత్తులను ఒకే వేదిక మీదకు ఈ ఉత్సవం ద్వారా తీసుకురానున్నామన్నారు.