
పళణి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్గాలు నిరసన బాట పట్టాయి. ప్రజా చైతన్య యాత్రలో పళణి స్వామి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైను టార్గెట్ చేశారు. ఆయన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ బిచ్చగాడితో సమానంగా పొల్చాడం వివాదానికి దారి తీసింది. తనను బిచ్చగాడిగా పేర్కొంటూ పళణి స్వామి చేసిన వ్యాఖ్యలను సెల్వ పెరుంతొగై తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, పళణి స్వామి దృష్టిలో వెనుకబడిన సామాజిక వర్గం నేతలంతా బిచ్చగాళ్లు అన్నది స్పష్టమవుతోందన్నారు. తనను మాత్రమే కాదు, వెనుకబడిన సామాజిక వర్గంలోని వారందర్నీ పళణి స్వామి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ మేరకు కాంగ్రెస్‌కు విశ్వాసంగా ఉన్నానో అన్నది తన అధిష్టానానికి తెలుసునని సూచించారు. అయితే అన్నాడీఎంకేకు పళణి స్వామి విశ్వాస పాత్రుడిగా ఉన్నారా..? లేదా..? అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎంజీఆర్, జయలలితను తీవ్రంగా దూషించిన బీజేపీతో తాజాగా చేతులు కలిపిన ఆయన విశ్వాసం గురించి మాట్లాడటమా? అని మండి పడ్డారు. తాను ఓ ప్రజా ప్రతినిధి అని తనను బిక్షగాడిగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో పళని స్వామికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో చైన్నె, శివారులు, విరుదునగర్, కన్యాకుమారి, తిరునల్వేలి తదితర ప్రాంతాలలో నిరసనలు బయలుదేరాయి. సెల్వ పెరుంతొగైకు పళణి స్వామి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వర్గాలు నినాదించారు. పళణి స్వామి పోస్టర్లకు చెప్పుల మాలలు వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.