
ఐఐటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఐఐటీ మద్రాసులో ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు భాగస్వాములయ్యారు. బుధవారంసాయంత్రం నుంచి పొద్దుపోయే వరకు సంబరాలు జరిగాయి. విద్యార్థులు, మహిళలు పూజ కోసం బంతి, చామంతి, తంగేడు వంటి రంగు రంగుల రకరకాల పూలను పేర్చి బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం అమ్మవారి ముందు దీపాలను వెలిగించి, శాస్త్రోక్తంగా పూజించి హారతులను ఇచ్చారు. తర్వాత రంగు రంగుల పూలతో అలంకరించిన పెద్ద బతుకమ్మను, చిన్న బతుకమ్మలను ఓపెన్ ఎయిర్ థియేటర్లో నట్ట నడుమన ఉంచి బతుకమ్మ పాటల కనుగుణంగా చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ అలరించారు. విద్యార్థినులు శాసీ్త్రయ సంప్రదాయ దుస్తులైన పరికిణి, ఓణీ, చీరలను ధరించగా విద్యార్థులు పంచెలు, ధోతీలను ధరించి తెలుగు సంస్కృతిని చాటారు. బతుకమ్మ వేడుకలో విద్యార్థుల డీన్ ప్రొఫెసర్ గుమ్మడి సత్యనారాయణ సతీ సమేతంగానూ, చైర్మన్ కౌన్సిల్ అఫ్ వార్డెన్ ప్రొఫెసర్ సన్యాసిరాజు, బతుకమ్మ కార్య నిర్వాహకుడు విద్యార్థి పోషాద్రి బృందం, విద్యార్థులు, ఐఐటీ ఆవరణలోని మహిళలు తరలి వచ్చారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం చేసిన చక్కెరపొంగలి, పులిహోర ప్రసాదాలను వేడుకలో పాల్గొన్న వారికి పంచి పెట్టారు.

ఐఐటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు