
ముసిరి నేతలతో స్టాలిన్ భేటీ
సాక్షి, చైన్నె : తిరుచ్చి జిల్లా ముసిరి అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో గురువారం సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. నేతలతో వేర్వేరుగా గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. సోదరా కదిలిరా నినాదంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలలో డీఎంకే కోల్పోయిన నియోజకవర్గం, తక్కువ ఓట్లుతో గెలిచిన స్థానాలను ఎంపిక చేసి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో తిరుచ్చి జిల్లా ముసిరి నేతలతో వేర్వురుగా సమావేశమయ్యారు. ఇది వరకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో నేతను పిలిపించిన స్టాలిన్, తాజాగా ఆ నియోజకవర్గంలోనే ముఖ్య నేతలను పిలిపించి వేర్వేరుగా మాట్లాడారు. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. సమష్టిగా పనిచేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని , ఎన్నికల పనులు వేగవంతం చేయాలని ఈసందర్భంగా నేతలను స్టాలిన్ ఆదేశించారు.
దేశంలో తొలి అభయారణ్యం
సాక్షి, చైన్నె : భారత దేశంలో తొలి సముద్రపు ఆవులు(సీ కౌవ్) అభయరాణ్యంకు తమిళనాడును వేదికగా ఎంపిక చేశారు. తంజావూరు –పుదుకోట్టై జిల్లాల మధ్య ఉన్న సముద్ర తీరాన్ని ఈ అభయారణ్యంగా ప్రకటించారు. ఈ అభయారణ్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025లో ఈ అభయారణ్యానికి ఆన్‌లైన్ ద్వారా ఓటు ఆమోదించడం అభినందనీయమన్నారు. తమిళనాడు అటవీ శాఖ చొరవ ఇందులో ఉందని ప్రశంసించారు.
కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు సమ్మె
కొరుక్కుపేట: పర్మనెంట్ చేయాలని కోరుతూ వారం రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు సమ్మె చేస్తున్నారు. తమిళనాడు నర్సుల ఆందోళన అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. వారు వారం రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సమాన పనికి సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్లతో కార్మికులు ఈ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం 30వ తేదీ వరకు ఆసుపత్రి సముదాయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రజలు గుమిగూడే బహిరంగ ప్రదేశాలలో నిర్వహించున్నారు. దీని గురించి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుజిన్ మాట్లాడుతూ ఎంపిక ద్వారా నియమితులైన నర్సులను 2015 వరకు పర్మినెంట్ చేశారు. 2016 నుంచి వారిని పర్మినెంట్ చేయలేదు. 9,000 పోస్టుల్లో 6,000 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఆర్‌పీ ద్వారా ఎంపికై న నర్సులకు పర్మినెంట్ నర్సులుగా పనిచేస్తున్న వారికి ఒకే జీతం నిర్ణయించాలి. ఎన్నికల హామీ ప్రకారం అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
గాలిలో అర్ధగంట ఎయిర్
ఇండియా విమానం చక్కర్లు
చివరికి బెంగళూరులో ల్యాండింగ్
సాక్షి,చైన్నె : ల్యాండింగ్ కోసం చైన్నె గగన తలంలో ఎయిర్ ఇండియా విమానం అర్ధ గంట చక్కర్లు కొట్టింది. చివరకు విమానాన్ని బెంగళూరులో ల్యాండింగ్ చేశారు. వివరాలు.. ఢిల్లీ నుంచి 152 మంది ప్రయాణీకులు ఎనిమిది మంది సిబ్బంది చైన్నెకు బుధవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. 8.30 గంటల సమయంలో ఈ విమానం ల్యాండింగ్ చేయాల్సి ఉంది. అయితే, గాలిలలోనే అర్ధగంట చక్కర్లు కొట్టిన ఈ విమానం ఆతర్వాత కనిపించ లేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు రాత్రి తొమ్మిదినర గంటల తర్వాత ఈ విమానం బెంగళూరులో ల్యాండ్ చేశారు. గురువారం ఉదయం ఈ విమానంలో ఉన్న ప్రయాణికులు చైన్నెకు వచ్చారు. విమానం గాలిలో చక్కర్లు కొట్టడం, బెంగళూరులో ల్యాండ్ చేయడం, కొన్ని గంటల ఆలస్యంగా చైన్నెకు రావడం గురించి సరైన సమాచారం తమకు ఎవ్వరూ ఇవ్వలేదంటూ ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ ప్రచారంలో మార్పు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ప్రచారంలో మార్పులు జరిగాయి. మీట్ ది పీపుల్ నినాదంతో ఈనెల 13న తిరుచ్చిలో విజయ్ ప్రచార ప్రయాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెండు విడతల ప్రచారం పూర్తి చేశారు. మూడో విడతగా 27వ తేదీ నామక్కల్, కరూర్‌లో పర్యటించనున్నారు. ఇది వరకు ప్రతి శనివారం 3 జిల్లాలలో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపకల్పన చేశారు. తాజాగా ఇందులో మార్పు చేశారు. ఉదయం ఒక జిల్లా, సాయంత్రం మరో జిల్లా అని మార్పు చేశారు. డిసెంబరు 20వ తేదీ వరకు ప్రచార ప్రయాణానికి తొలుత తేదీలు ఖరారు చేశారు. తాజాగా చేసిన మార్పులో 2026 ఫిబ్రవరి 21వతేది వరకు విజయ్ ప్రచారం జరగనున్నాయి. చివరగా చెంగల్పట్టు, చైన్నె జిల్లాలో ఫిబ్రవరి 21వ తేదీన ప్రచారం విజయ్ నిర్వహించనున్నారు.